
వ్యవసాయ కార్యాలయంలో మొక్క నాటుతున్న పార్థసారధి
ఖమ్మం వ్యవసాయం: రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల సమస్య తలెత్తకుండా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా సరఫరా చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ సి.పార్థసారధి అన్నారు. గోదావరి అంత్య పుష్కరాల కోసం ఆదివారం భద్రాచలం వెళుతూ మార్గమధ్యలో ఖమ్మంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం, విలేకరులతో మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామస్థాయిలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందించే బాధ్యతను ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు అప్పగించామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో వర్షాలు అనుకూలిస్తున్నాయని అన్నారు. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ పి.మణిమాల, ఉద్యాన శాఖ ఉప సంచాలకుడు ఆర్.శ్రీనివాసరావు, సహాయ సంచాలకుడు కె.సూర్యనారాయణ, జిల్లా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకుడు ఎస్.వినోద్‌కుమార్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సుధాకర్ రావు, స్వరూపరాణి, టెక్నికల్ ఆఫీసర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘మార్కెట్’ ద్వారా 10లక్షల మొక్కల పెంపకం
ఏన్కూరు: హరితహారం కార్యక్రమం కింద రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల ద్వారా 10లక్షల మొక్కల పెంపకం చేపట్టినట్టు మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి తెలిపారు. స్థానిక మార్కెట్ కమిటీæ కార్యాలయం ఎదుట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మార్కెట్ కమిటీల్లో ఇప్పటివరకు 8.70 లక్షల మొక్కలు నాటినట్టు చెప్పారు. వారం రోజుల్లోగా లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలోని 180 మార్కెట్ కమిటీలు, 340 సబ్ యార్డులు, 330 నాబార్డ్ గోడౌన్ల పరిధిలో మొక్కలు నాటినట్టు చెప్పారు. గత ఏడాది మార్కెట్ కమిటీల ద్వారా 4.50 లక్షల మొక్కలు వేసినట్టు చెప్పారు. ఉద్యాన శాఖ ద్వారా 23లక్షల మొక్కలు పెంపకం చేపట్టామన్నారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ వరకు మొక్కలు నాటుతామన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2.50 కోట్ల మొక్కలు వేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 2.10 కోట్ల మొక్కలు నాటినట్టు చెప్పారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏyీ ఎం వినోద్, హార్టీకల్చర్ డీడీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ కార్యదర్శి నిర్మల, సూపర్‌వైజర్ రాజా పాల్గొన్నారు.