వైద్య విద్యార్థికి ప్రణాళిక ముఖ్యం
వైద్య విద్యార్థికి ప్రణాళిక ముఖ్యం
Published Sat, Oct 8 2016 12:21 AM | Last Updated on Tue, Oct 16 2018 3:26 PM
–లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
- గ్లోబల్ డాక్టర్లుగా ఎదగాలి
- ఫ్రెషర్స్ డే వేడుకల్లో డీఐజీ రమణకుమార్
కర్నూలు(హాస్పిటల్): వైద్య విద్యార్థులకు ప్రణాళిక ఎంతో ముఖ్యమని కర్నూలు రేంజ్ డీఐజి బీవీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజిలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ ఐఏఎస్ కంటే డాక్టర్ కావడమే కష్టమని, అది సాధించిన వైద్యవిద్యార్థులందరూ అభినందనీయులన్నారు. ఎంసెట్‌లో ర్యాంకు సాధించిన తర్వాత రిలాక్స్ అవుతున్నారని, అంతటితో ఆగకుండా నిత్యం లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని సా«ధించుకుంటూ ముందుకు సాగాలన్నారు. ధర్మరక్షక్ వంటి గొప్ప వైద్యులను ఆదర్శంగా తీసుకుని చిన్న చిన్న లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చిన్న డాక్టర్‌గా మిగిలిపోకుండా గ్లోబల్ డాక్టర్‌గా అయ్యేందుకు కృషి చేయాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజిలో చదివిన వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన విషయం మరువకూడదన్నారు.
నిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ ధర్మరక్షక్ మాట్లాడుతూ తాను 44 ఏళ్ల క్రితం ఇదే కళాశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన క్రమశిక్షణను అలవరచుకోవాలని సూచించారు. సీనియర్లను గౌరవించాలని, వారి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే పేదలకు సేవ చేయాలన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ..వైద్యవృత్తిని ప్రేమించాలన్నారు. నిరంతరం జ్ఞానసముపార్జన చేసుకుంటూ ఉంటేనే వైద్యునిగా సమాజంలో రాణిస్తారని చెప్పారు. కళాశాలలోని అత్యాధునిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్‌రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ వై. భాస్కర్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, మెడిసిన్‌ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement