♦ లక్ష్యాలు బారెడు... ఇచ్చేది మూరెడు
♦ ప్రభుత్వ పథకాలకు ముఖం చాటేస్తున్న
♦ బ్యాంకర్లు శాఖల మధ్య సమన్వయలోపం
♦ కొరవడిన పర్యవేక్షణ
♦ వార్షిక రుణ ప్రణాళికలు కాగితాలకే పరిమితం
సాక్షి, విశాఖపట్నం: జిల్లా యంత్రాంగం ప్రకటించే వార్షిక రుణ ప్రణాళికలు ప్రహసనంగా మారుతున్నాయి. వివిధ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకర్లు గాలికొదిలేస్తున్నారు. శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ ప్రకటనలో జాప్యం.. లబ్ధిదారుల ఎంపికలో శాఖలు చూపించే అలసత్వం.. సబ్సిడీ మొత్తం విడుదలలో ప్రభుత్వం చేసే అలక్ష్యం...అన్నింటి కంటే ముఖ్యంగా బ్యాంకుల నిరాసక్తత లక్ష్యాలను నీరుగారుస్తున్నాయి. కావాలని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా బ్యాంకర్లైపై చర్యలు తీసుకునే సాహసం జిల్లా యంత్రాంగం ఏనాడు చేయలేకపోతోంది. దీంతో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి.
పొంతనలేని కేటాయింపులు: 2014-15లో ఏకంగారూ.7260 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను నిర్దేశిస్తే.. రూ.4895 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1653 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. రూ.886 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ప్రాధాన్యతా రంగాలకు రూ.5377 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. రూ.2197కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.1883 కోట్లకు రూ.2699 కోట్ల మేర ఇవ్వగలిగారు. హుద్‌హుద్ దెబ్బతో ఆ ఏడాది దాదాపు అన్ని రంగాలు కుదేలవడంతో లక్ష్యాలను చేరుకోలేక పోయాయని సరిపెట్టుకోవచ్చు. కాని 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.8198 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటిస్తే రూ.7880 కోట్ల మేర ఇవ్వగలిగారు.
95 శాతం మేర రుణాలు ఇవ్వగలిగినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాలకు మాత్రం లక్ష్యాలకు ఆమడ దూరంలోనే రుణాలివ్వగలిగారు. ప్రాధాన్యత, ప్రాధాన్యేతర రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యత వ్యవసాయ, అనుబంధ రంగాలు.. వివిధ శాఖలకు ఇవ్వలేదు ఒక్క పంట రుణాలు మినహా.. వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేనికి లక్ష్యం మేరకు రుణాలివ్వలేదు. వీటితో పాటు బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, బ్యాంకర్లు నిర్లక్ష్యాన్నే ప్రదర్శించాయి. ఆయా శాఖలకు నిర్దేశించిన యూనిట్లకు కాస్త ఆలశ్యమైనా చాలా వరకు సబ్సిడీ మొత్తాలు విడుదల చేసినప్పటికీ బ్యాంకర్లు నిరాసక్తతనే ప్రదర్శించాయి. వ్యవసాయ అనుబంధ రంగాలకు సుమారు రూ.2,150కోట్లు లక్ష్యం కాగా.. రూ.1852 కోట్లు ఇవ్వగలిగారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.75 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా కేవలం రూ.2.87కోట్లు, డెయిరీ యూనిట్లకు రూ.137 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.17.30 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక మిగిలిన వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఇదే రీతిలో అరకొరగానే రుణాలు ఇచ్చారు.
సంక్షేమ శాఖలదీ అదే తీరు
సంక్షేమ శాఖల విషయానికొస్తే ఎస్సీ సంక్షేమ శాఖ కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు సబ్సిడీ పోను రూ.17.92 కోట్ల మేర ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.4.11కోట్లు ఇవ్వగలిగారు. బీసీ కార్పొరేషన్ పరిధిలో కూడా లక్ష్యంలో 50 శాతానికి మించి రుణాలివ్వలేకపోయారు. కానీ ప్రాధాన్యేతర రంగాలకు రూ.2448 కోట్లు ఇవ్వాలని నిర్ణయించగా.. ఏకంగా రూ.3483 కోట్లు ఇచ్చారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.1000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా. ఏకంగా రూ.1612కోట్లు ఇవ్వగలిగారు. ఇక 2016-17లో ఎప్పటిలాగే 26 శాతం హెచ్చుతో ఏకంగా రూ.10,340 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రెండ్రోజుల క్రితం జిల్లా కలెక్టర్ యువరాజ్ విడుదల చేశారు. ఈసారి లక్ష్యాల మేరకు రుణాలివ్వని బ్యాంకర్లపై క్రిమినల్ కేసులు పెడతానని ఘాటుగానే హెచ్చరించారు. ఈహెచ్చరికలు ఏమేరకు సత్పలితాలనిస్తాయో వేచిచూడాల్సిందే.