కరీంనగర్ క్రైం: మొక్కల రక్షణకు ప్రాధాన్యతమివ్వాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ పీటీసీలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని లక్ష మొక్కలను నాటే లక్ష్యం పూర్తికావచ్చిందన్నారు. ప్రతి పౌరుడు తమ సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలను నాటేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు సామాజిక భాద్యతగా గుర్తించి హరితహరం కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారన్నారు.
పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నాటుతున్న ప్రతి మొక్క రక్షణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రహరీ ఉన్న ప్రాంతాల్లో మొక్కలను రక్షించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శశాంక, డీఎఫ్‌వో శ్రీనివాస్, పీటీసీ వైస్ ప్రిన్సిపాల్ రాంరెడ్డి, డీఎస్పీలు భీంరావ్, లక్ష్మినారాయణ, సీఎల్‌ఐలు కమలాకర్, చంద్రయ్య, నవీన్, రమణబాబు, ఆర్‌ఐలు నర్సయ్య, నవీన్, ఇన్‌స్పెక్టర్లు మహేశ్‌గౌడ్, రంగయ్య, ఇండోర్, అవుట్‌డోర్ విభాగాలకు చెందని పోలీసులు పాల్గొన్నారు.
హరితహారం వేగం పెంచాలి
కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమంలో వేగాన్ని పెంచి జిల్లా లక్ష్యాన్ని అధిగమించాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాలకు నిర్ణయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటుటకు అంచనాలు తయారు చేయాలని, నాటిన మొక్కలకు వెంటనే జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఇంత వరకు నాటిన మొక్కలన్నింటికి వారంరోజుల్లో జియోట్యాగింగ్ పూర్తి చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు.
జిల్లాలో రైల్వేలైన్, పంచాయతీరాజ్ రోడ్లు, గ్రామాలలో ఉన్న మట్టిరోడ్లు, కెనాల్ రోడ్లు, ఒర్రెలు, వాగులు, మానేరు నది వెంబడి ఎన్ని మొక్కలు నాటుతారో అంచనాలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో 51 మంది గ్రీన్ బ్రిగ్రేడియర్లను నియమించాలని అన్నారు. అందులో మహిళలు, అన్ని కులాలకు చెందిన వారు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని వారికి ఎంపీడీఓలు ఉత్తర్వులు జారీ చేయాలని, వారం రోజుల్లో వారి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, గ్రీన్ బ్రిగేడియర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మూడవ విడత హరితహారంలో నాటిన మొక్కలకు వరుసగా ఏడురోజులు వర్షాలు లేకుంటే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాలని, అందుకు రవాణా చార్జీలు చెల్లిస్తామని తెలిపారు.
ఇళ్లలో మహిళలకు కావాల్సిన పూలు, పండ్ల మొక్కలు ఎన్ని కావాల్సినా తెప్పించి ఇస్తామని, వాటిని ప్రజల భాగస్వామ్యంతో నాటించి రక్షించే ఏర్పాటు చేయాలని సూచించారు. రైతుల పొలాల గట్లపైన నాటుకునేందుకు మొక్కలు సరఫరా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి ఆయేషా మస్రత్‌ఖానమ్, అటవీ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ అధికారి శ్రీధర్, సీపీవో సుబ్బారావు, డీపీఓ నారాయణరావు, హర్టికల్చర్ ఏడీ శ్రీనివాస్, డీఈవో రాజీవ్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మెప్మా పీడీ పవన్‌కుమార్, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.