- పాఠశాలల్లో కూరగాయలను పండించాలి
- కలెక్టర్ యోగితారాణా
- డీఈవో లింగయ్యకు ప్రశంస
లెక్కలుంటేనే మొక్కలున్నట్లు
Published Fri, Sep 16 2016 11:22 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
డిచ్‌పల్లి :
తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కలకు ఉపాధి హామీ కూలీలతో అనుసంధానం చేసి మొక్కల సంరక్షణకు నీరు పోస్తున్నట్లు జాబ్‌కార్డుల ద్వారా చెల్లింపులు జరిపితేనే మొక్కలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తుందని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా స్పష్టం చేశారు. శుక్రవారం డిచ్‌పల్లిలోని ట్రైజం ట్రైనింగ్ సెంటర్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో హరితహారం మొక్కల మనుగడకు చేపట్టిన చర్యలను కలెక్టర్ సమీక్షించారు. ఇక నుంచి ప్రతి మొక్కకు వారం, వారం నీరు పోయాలని ఆదేశించారు. నీరు పోసేందుకు ఉపాధిహామీ పథకం కింద జాబ్‌కార్డులను జారీ చేసి ప్రతినెలా చెల్లింపులు జరుపనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలల్లో నాటిన మొక్కలకు విద్యార్థులతో నీరు పోయించరాదని స్పష్టం చేశారు. విద్యా సంస్థల్లో నీరు పోసేందుకు ప్రతి మొక్కకు రోజుకు 45 పైసల చొప్పు నెలకు 26 రోజుల పాటు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి ఉపయోగపడే కూరగాయలను హరితహారంలో భాగంగా పెంచాలని సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో మునగ, ఉసిరి మొక్కలను నాటాలన్నారు. చనిపోయిన వాటి స్థానంలో ప్రత్యామ్నాయ మొక్కలను నాటాలని ఆదేశించారు. శాఖల వారీగా ఈనెల 25లోపు మొక్కల మనుగడపై నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. చనిపోయిన మొక్కల స్థానంలో 44వేల 585 మొక్కలు నాటించిన జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్యను కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. మొక్కల మనుగడపై క్షేత్రస్థాయి పరిశీలనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక అధికారుల బృందం రానున్నట్లు తెలిపారు. మొక్కలకు ముళ్లకంప కంచెలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రీ గార్డుల ఏర్పాటుకు బ్యాంకు అధికారులు ఇప్పటి వరకు రూ. 6.30 లక్షలను విరాళంగా ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ మున్సిపాలిటీలో నాటిన మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటు కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ ఇంజినీర్లను ఆదేశించారు. కళాశాలలు, పాఠశాలల ఆవరణలో ఫాం పాండ్స్, కమ్యూనిటీ సోక్‌పిట్స్ నిర్మించడానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో మోహన్‌లాల్, డ్వామా పీడీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఆర్డీవోలు యాదిరెడ్డి, నగేశ్, సుధాకర్‌రెడ్డి, yీ ఎఫ్‌వోలు సుజాత, ప్రసాద్, జోజి, హార్టికల్చర్ డీడీ సునంద తదితరులు పాల్గొన్నారు.
Advertisement