భాస్కర్ వచ్చాకే ఫైళ్లు కదులుతున్నాయట
సాక్షి, ఏలూరు : జిల్లా కలెక్టర్‌గా ఎవరున్నా ఆయన వ్యవహార శైలి, పనితీరుకు అనుకూలంగా అధికారులు మసలు కోవడం సహజమే. కానీ.. ప్రస్తుత కలెక్టర్ కె.భాస్కర్‌ను జిల్లా అధికారులు ఆయన పనితీరును బహిరంగంగా ప్రశంసించడం విశేషం. తాజాగా కలెక్టర్ పనితీరును పొగుడుతూ పౌర సంబంధాల అధికారి ద్వారా శుక్రవారం ప్రకటన విడుదల చేయడం మరీ విశేషం. జిల్లా పంచాయతీ అధికారి ఎ.నాగరాజువర్మ, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.రమణ, వయోజన విద్యాశాఖ డెప్యూటీ డెరైక్టర్ దుర్గాభవాని, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ కేఈ సాధన శుక్రవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
కలెక్టర్ భాస్కర్ మెరుపువేగంతో ఫైళ్లను క్లియర్ చేస్తున్నారని, గురుపూజోత్సవానికి వచ్చినప్పుడు కూడా ఫైళ్లు పరిష్కరించారని కొనియాడారు. జూలై 12న బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అధికారుల పనితీరును స్వయంగా బేరీజు వేసుకునే స్థాయికి చేరారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ బంగ్లాలోకి అధికారులెవరూ రానవసరం లేదని, ఫైల్ పంపిస్తే వెంటనే పరిష్కరిస్తానని కలెక్టర్ చెబుతున్నారని తెలిపారు. తప్పు మీద తప్పులు చేసే అధికారులకు నోటీసులు ఇస్తూ, అధికారులకు హితబోధలు చేస్తున్నారన్నారు.
గతంలో రెండు నెలలు పట్టేది
గతంలో కలెక్టర్ నుంచి ఫైల్ రావడానికి నెలల తరబడి ఎదురుచూసేవాళ్లమని, భాస్కర్ వచ్చినప్పటి నుంచి 2 లేదా 5 నిమిషాల్లో ఫైల్‌పై చర్చించి అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో కలెక్టర్ బంగ్లాలో సమర్పించిన ఫైల్స్‌ను కలెక్టర్ ఎప్పటికి చూస్తారో, అవి ఎప్పటికి కార్యాలయాలకు తిరిగి వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని కొందరు అధికారులు అంటున్నారని తెలిపారు. ప్రస్తుత కలెక్టర్‌పై తమ ‘భక్తి’ని చాటుకోవడానికి గత కలెక్టర్లు పనిచేయలేదని స్వయంగా అధికారులు బహిరంగంగా ప్రకటించడం, పత్రికా ప్రకటనలు చేయడం విమర్శలకు తావిస్తోంది.