అర్హులకే మూడెకరాల భూమి
అర్హులకే మూడెకరాల భూమి
Published Sun, Sep 4 2016 1:04 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
బోధన్ రూరల్:
భూపంపిణీ పథకం కింద అర్హులైన దళితులకే మూడెకరాల భూమిని ఇవ్వనున్నట్లు కలెక్టర్ యోగితారాణా తెలిపారు. భూకొనుగోలు పథకం కోసం భూములు విక్రయించేందుకు వచ్చిన కామారెడ్డి, బోధన్ డివిజన్ రైతులతో ఆమె శనివారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధర నిర్ధారణపై వారితో చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టాదారులతో చర్చించి 360 ఎకరాలకు చెందిన పొల్లాలోని వనరులు, పండించే పంటలను బట్టి ధరను నిర్ణయించినట్లు చెప్పారు. భూములను అమ్మేందుకు ముందుకు వచ్చే పట్టాదారులతో వారి పంట పొలాల్లో నీటి వనరులు, వెట్ మరియు డ్రై క్రాప్ వివరాలను సంబంధిత గ్రామ వీఆర్వో, తహసీల్దార్లతో మాట్లాడి భూముల ధరల వివరాలను ముందుగానే పట్టాదారులకు తెలియచేయాలని వివరించారు. భూములు విక్రయించగా వచ్చిన డబ్బును వృథా చేయొద్దని ఆమె రైతులకు సూచించారు. పట్టాదారుల నుంచి స్వీకరించిన భూములు రిజిస్ట్రేషన్ కాగానే, వారి ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇందులో ఎవరు ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. జేసీ రవీందర్‌రెడ్డి, బోధన్, కామారెడ్డి ఆర్డీవోలు సుధాకర్‌రెడ్డి, నగేష్ రెడ్డి, విమాలాదేవి తదితరులు పాల్గొన్నారు.
Advertisement