జిల్లాకు భారీ వర్షసూచన
Published Mon, Sep 12 2016 11:53 PM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
జిల్లాకు భారీ వర్షసూచన ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం కె చంద్రశేఖర్‌రావు జిల్లా కలెక్టర్ డాక్టర్ యోగితారాణాకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సోమవారం తెలంగాణలో భారీ వర్ష సూచనలున్న జిల్లా కలెక్టర్‌లతో మాట్లాడిన సీఎం కే సీఆర్ మన జిల్లా కలెక్టర్‌తోనూ మాట్లాడినట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోనే కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన కలెక్టర్ యోగితారాణా భారీ వర్షసూచనపై అధికారులను సైతం అప్రమత్తం చేశారు. తక్షణ చర్యలు, సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 1800–425–6644 ఏర్పాటు చేశారు.. తన చాంబర్‌లో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మూడు, నాలుగు రోజులుగా తెలంగాణలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఇదివరకే కరీంనగర్, వరంగల్ ఇతర జిల్లాల్లో భారీ వర్షాల వల్ల పట్టణాలు, గ్రామాల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితులు కలుగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. నిజామాబాద్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తం ఉండాలని కలెక్టర్ స్థానిక అధికారులను ఆదేశించారు. వర్షాలు భారీగా కురిస్తే ప్రమాదాలు ఏర్పడే ప్రాంతాలను, లోతట్టు ప్రాంతాలను ముందస్తుగానే గుర్తించి తగిన ఏర్పాటు చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తుండాలన్నారు. వాగులు, కాల్వలు, చెరువుల ప్రాంతాల్లో సైతం పరిశీలన కొనసాగాలన్నారు. వర్షాలతో ఏర్పడే ఇబ్బందులను టోల్ ఫ్రీ నెంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు, ఉద్యోగులకు సూచించారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు మండల, గ్రామ స్థాయి యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులతో పేర్కొన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భారీ వర్షాలు సంభవించినప్పుడు, వాగులు, వంకలు పొంగి రహదారులు మూతపడి ఇబ్బందిపడే మారుమూల గ్రామాల ప్రజలకు అత్యవసర సేవలను అందుబాటులో ఉంచాలన్నారు. రోడ్డు, విద్యుత్తు వ్యవస్థకు నష్టం జరిగితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. చెరువులు, కుంటలకు గండ్లు పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులను చేపట్టాలన్నారు. మిషన్ కాకతీయ చెరువులకు చేరే నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్లు, వీఆర్వో, వీఆర్‌ఏలను ఆదేశించారు. అత్యవసర మందులను అన్ని గ్రామాలు, ఉప కేంద్రాలలో సమృద్ధిగా నిలువ ఉంచాలన్నారు. తాగునీటి వనరులను క్లోరినేషన్ చేయాలని, వర్షాలు పడినప్పుడు గ్రామాల్లో అంటు వ్యాధులకు గురి కాకుండా సానిటేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 104,108 వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. నిత్యావసర వస్తువుల కొరత రాకుండా ముంపు ప్రభావానికి గురయ్యే గ్రామాలకు ఆక్టోబర్ మాసం రేషన్‌ను కూడా పంపించాలని సూచించారు. వాగులు, నదులపై తక్కువ ఎత్తులో ఉన్న బ్రిడ్జిల వద్ద భద్రత చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి, డీఆర్వో పద్మాకర్ డీఎంహెచ్‌వో వెంకట్, సీపీవో శ్రీరాములు, ఐకేపీ పీడీ చం్ర మోహన్‌రెడ్డి, డీఎస్‌వో కృష్ణ ప్రసాద్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement