
శ్రీరామ నవమి వేడుకల్లో దొంగాట
♦ ఈ ఆటాడితే గ్రామంలో దొంగతనాలు
♦ జరగవని.. పంటలు సుభిక్షంగా ఉంటాయని నమ్మకం
♦ నల్లగొండ జిల్లా తుర్కపల్లిలో విచిత్ర ఆచారం
తుర్కపల్లి: నల్లగొండ జిల్లా తుర్కపల్లిలో ఎన్నో ఏళ్లుగా ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ప్రతి ఏటా నిర్వహించే శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గ్రామస్తులందరూ కలసి దొంగ.. పోలీసు వేషధారణల్లో ఆటాడుతారు. ఇలా ఆడి తే గ్రామంలో దొంగతనాలు జరగవని.. పంటలు పుష్కలంగా పండుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం. తుర్కపల్లి మండల కేంద్రంలో రాములగుట్ట ఉంది. ప్రత్తిపాటి వంశస్తులు వంశపారంపర్య ధర్మకర్తలుగా ఆ గుట్టపై నాలుగు రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తుంటారు. మొదటి రోజు సీతారాముల కల్యాణం, రెండోరోజు వనభోజనాలు, మూడో రోజు శ్రీసీతారామలక్ష్మణ మూర్తుల ఊరేగింపు, నాలుగో రోజు దొంగాట (దోపు) తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామంలో పాడిపంటలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆ శ్రీరామచంద్రుడు కాపాడుతున్నారని ఇక్కడి ప్రజల విశ్వాసం. గ్రామంలో వడగండ్ల వర్షం పడి పంటలు నష్టపోరుున దాఖ లాలు ఇప్పటివరకు లేవని స్థానికులు చెబుతుంటారు.
దోపు ఆట ఇలా..
రాత్రి ఎనిమిది గంటలకు శ్రీసీతారామలక్ష్మణ మూర్తుల సేవను ఊరేగింపుగా దోపు ఆట కొనసాగే స్థలం వద్దకు తీసుకువస్తారు. అప్పటికే గ్రామస్తులు, పత్తిపాటి వంశస్తులు అక్కడ ఓ పోలీస్‌స్టేషన్‌లా ప్రాంగణాన్ని తయూరు చేసి ఉంచుతారు. వివిధ వేషధారణల్లో ఉన్నవారంతా వేదికపై కూర్చుంటారు. దేవుడి దగ్గర పూజారిగా గ్రామస్తులే ఉంటారు. ఆ తర్వాత దొంగలుగా వేషాలు వేసుకున్న వాళ్లు ఆటలోకి ప్రవేశిస్తారు. వీరు శ్రీసీతారామచంద్రస్వామిని దోచుకుంటారు.
అనంతరం వీరిని పోలీసు వేషధారణల్లో ఉన్నవారు పట్టుకుని స్టేషన్‌కు తీసుకువస్తారు. దొంగతనం ఎందుకు చేశారని సబ్‌ఇన్‌స్పెక్టర్, పట్వారీ, పటేల్ విచారించే తీరు అందరికీ నవ్వులు తెప్పిస్తుం టుంది. చివరగా దోచుకున్న వస్తువులను పోలీస్‌స్టేషన్‌లో అప్పగిస్తారు. ఆ తరువాత కుండలో నీళ్లు తెచ్చి ప్రేక్షకుల మధ్యలో ఎత్తి వేయడంతో ఈ దోపు ఆట ముగుస్తుంది. ఆ తరువాత శ్రీసీతారామలక్ష్మణ మూర్తుల సేవను ప్రత్తిపాటి వంశస్తుల ఇంటి ముందు ఉంచి మంగళహారతులిచ్చి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. నేటికీ ఈ ఆచారం కొనసాగుతోంది.