ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న జేసీ, జేసీ–2, డీఆర్‌వో
చిత్తూరు (కలెక్టరేట్) : ‘మా సమస్యలపై స్పందించి పరిష్కరించండి సారూ..’ అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సోమవారం ప్రజావాణిలో అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో మీకోసం ప్రజావాణిని ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ గిరీష, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, డీఆర్‌వో విజయ్‌చందర్‌లు అర్జీదారుల నుంచి 92 వినతులు స్వీకరించారు. అందులో రెవెన్యూ 47, డీఆర్‌డీఏ 16, పౌరసరఫరాలు 13, వైద్య ఆరోగ్యశాఖ 3, హౌసింగ్, పోలీసు, ట్రాన్స్‌కోలకు రెండేసి చొప్పున, విద్యాశాఖకు ఒకటి, ఇతర శాఖలకు 5 చొప్పున వినతులు వచ్చాయి. అదేగాక ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించిన కాల్‌యువర్ కలెక్టర్‌కు 12 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులు, వినతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జేసీ ఆదేశించారు.