దౌర్జన్యకాండను అడ్డుకోండి..
దౌర్జన్యకాండను అడ్డుకోండి..
Published Sat, Oct 15 2016 5:25 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
అన్యాయంగా తమపై దాడి చేశారని పిల్లుట్ల దళితుల నిరసన
నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
మాచవరం: తమపై దౌర్జన్యం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి తమకు న్యాయం జరిపించాలని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దారు కార్యాలయం, పోలీసుస్టేషన్ ఎదుట పిల్లుట్ల గ్రామానికి చెందిన దళితులు ధర్నా నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామానికి చెందిన కొందరు బుధవారం రాత్రి పీర్ల చావిడి వద్ద ఎస్సీ కాలనీకి చెందిన ఎండూరి రవి, మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో, కేసు వాపసు తీసుకోకుంటే అంతు చూస్తామంటూ యాదవ కులానికి చెందిన కొందరు గురువారం రాత్రి కాలనీలోకి వచ్చి అడ్డువచ్చిన వారిని కొట్టారని వాపోయారు. అంతేగాక అధికార పార్టీ నాయకుల అండతో శుక్రవారం తమపై అక్రమ కేసు బనాయించారని చెప్పారు. గతంలోనూ ఇదే విధంగా జరుగగా, ఎస్సై రాజీ కుదిర్చారని తెలిపారు. పదే పదే దౌర్జన్యం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దారు ఆజాద్‌కు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో వినతి పత్రాలు అందజేశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement