పొగడ్తలు.. పాదాభివందనాలు
పొగడ్తలు.. పాదాభివందనాలు
Published Sat, Dec 31 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 11:58 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘అపర భగీరథుడు.. అభినవ కాటన్.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే జనం దృష్టిలో దేవుడు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మంత్రులు పొగడ్తలతో ముంచెత్తారు. ఆయనకు పాదాభివందనం చేయడానికీ పోటీపడ్డారు. మంత్రి రావెల కిషోర్‌బాబు అయితే ఓ కవిత రాయించి గాయనితో పాడించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో స్పిల్ వే కాంక్రీట్ పనులను సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. దీనికి ముందు సుదర్శన, వాస్తు హోమాలు నిర్వహించి.. గోదావరి మాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బాచింగ్ ప్లాంట్ (కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్)ను ప్రారంభించారు. ఆ తరువాత స్పిల్‌వే వద్ద పూజలు చేసి కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేశారు. తదుపరిఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఏడు ముంపు మండలాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని, తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపితేనే ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యమవుతుందని భావిం చి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. ఆ మండలాలను ఏపీలో విలీనం చేయించానని బాబు చెప్పారు. ఈ మండలాలను విలీనం చేయకుంటే తాను ప్రమాణ స్వీకారం చేయబోనని కూడా ప్రధాని వద్ద చెప్పానని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని స్పందించి ఏడు మండలాలు విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారని, ఇది తన ఘనతేనని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కొత్త భూసేకరణ చట్టం వర్తింపునకు చర్యలు తీసుకున్నామని సీఎం చెప్పారు. ఆ ప్రకారమే నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. జనవరి 7, 14వ తేదీల్లో ఇక్కడకు వచ్చి ప్రాజెక్ట్‌కు సంబంధించి డయాఫ్రమ్‌వాల్, గేట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రాజెక్ట్ కోసం సహకరించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నుంచి అందరినీ పేరుపేరునా సభకు పరిచయం చేశారు. పోలవరం స్పిల్‌వే కాంక్రీట్ పనులను పండగలా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించడంతో అధికారులు జిల్లా నలుమూలల నుంచి భారీగా జనాన్ని సమీకరించారు. 680 బస్సుల్లో పోలవరం ప్రాజెక్ట్ సైట్‌కు ప్రజల్ని తరలించారు. ఇందుకోసం ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించి మరీ బస్సులను తీసుకొచ్చారు. సభకు రాకపోతే ప్రభుత్వం ఇచ్చే పసుపు కుంకుమ సొమ్ము రూ.3 వేలు ఆగిపోతాయని గోపాలపురం మండల టీడీపీ కార్యకర్తలు మహిళలను బెదిరించి బస్సులు ఎక్కించగా, నల్లజర్ల మండలంలో సభకు రాని మహిళలకు రూ.300 చొప్పున జరిమానా విధిస్తామని బెదిరించారు. ఆచంట నుంచి 78 స్కూల్ బస్సుల్లో మహిళల్ని తీసుకొచ్చారు. సభకు రాకపోతే సోపానం ఇంటర్వూ్యల్లో లబ్ధిదారులను పక్కన పెడతారని, కొత్త ఇళ్లు మంజూరు చేయరని, డ్వాక్రా గూపు సభ్యులకు రుణాలు మంజూరు చేయరని అధికారులు ప్రచారం చేసి మహిళలను, వివిధ పథకాల లబ్ధిదారులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించారు. నరసాపురం, సమీప గ్రామాల నుంచి ప్రైవేట్ కళాశాలలకు చెందిన బస్సులలో జనాన్ని తీసుకెళ్లారు. ఈ ప్రాంతం నుంచి మహిళలు తక్కువ సంఖ్యలోనే వెళ్లారు. మనిషికి రూ.300 వరకూ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ప్రసంగాలు మూడు గంటలకు పైగా సాగడంతో జనమంతా మధ్యలోనే సభ నుంచి తిరుగుముఖం పట్టారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రతిజ్ఞ చేయించే సమయానికి సభాస్థలిలో పోలీసులు, మీడియా ప్రతినిధులు మాత్రమే మిగిలారు.
పొరుగు జిల్లాల నుంచీ జనం తరలింపు
పోలవరం/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభకు పలు జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల్లో ప్రజలను తరలించారు.
కొవ్వూరు నుంచి పోలవరం వరకు ఏటిగట్టు రోడ్డు సింగిల్ లేన్ కావడంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గూటాల సమీపంలో గంటపాటు
ట్రాఫిక్ స్తంభించింది. దీంతో కొత్త పట్టిసీమ నుంచి గూటాల వరకు బస్సులను మళ్లించారు.
పోలవరం నుంచి తాళ్లపూడి మార్గంలో ఆర్టీసీ బస్సులు నడపకపోగా, ఆటోల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని ఎత్తైన ఘాట్ రోడ్లపైకి బస్సులు వెళ్లేందుకు మలుపుల వద్ద ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సభకు వచ్చిన జనం భయాందోళనకు లోనయ్యారు.
సభ ముగిసిన తరువాత వాహనాలన్నిటినీ ఒకే మార్గంలో మళ్లించడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి.
సభా ప్రాంగణానికి వెళుతున్న మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనను చూసి పలువురు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు.
Advertisement