పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం
పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటాం
Published Fri, Nov 25 2016 10:50 PM | Last Updated on Tue, May 29 2018 2:48 PM
పోలవరం రూరల్ : ’అధైర్యపడవద్దు, అండగా ఉంటాం. సమస్యలను పోరాడి పరిష్కరించుకుందాం’ అని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి పోలవరం నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎనిమిది గ్రామాల నిర్వాసితులు పోలవరం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారానికి 11వ రోజుకు చేరుకున్నాయి. దీక్షాశిబిరాన్ని శుక్రవారం సందర్శించిన నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు నిర్వాసితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాసిత నేతలు ముచ్చిక రంజిత్‌కుమార్, కొవ్వాసి మేఘం, ముచ్చిక సక్కుబాయి, కోటం వీరాయమ్మ తదితరులు మాట్లాడుతూ కొందరికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.1.70 లక్షలకు రూ. 1.20 లక్షలు ఇచ్చారని, సాగుకు వీలులేని భూములు కేటాయించారని, శ్మశానవాటికకు స్థలం కేటాయించలేదని, ఇంకా 18 సంవత్సరాలు నిండిన కొందరు యువతకు ప్యాకేజీలు ఇవ్వాలని, ఇంటి అద్దెలు ఇవ్వాలని, చెట్ల నష్టపరిహారం చెల్లించలేదని వివరించారు. అనంతరం నాగిరెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకోవడానికి వచ్చామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.10వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు పెంచారని, నిర్వాసితులకు అన్యాయం చేసి బయటకు పంపడం మానవత్వం కాదని పేర్కొన్నారు. అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇచ్చారని గుర్తుచేశారు. వైఎస్సార్ ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభించడంతోపాటు అన్ని అనుమతులూ తీసుకువచ్చారని జ్ఞప్తికి తెచ్చారు. తమ పార్టీ అధినేత వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి కూడా నిర్వాసితులకు న్యాయం జరగాలనే తన వంతు కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు ప్రాజెక్టుకు, నిర్వాసితులకు వ్యతిరేకం కాదని, ఏమీ చేయలేని స్థితిలో వారు ఉన్నారని వెల్లడించారు. నిర్వాసితులపై అక్రమ కేసులు పెట్టడం పద్ధతి కాదని సర్కారుకు హితవు పలికారు.
పోలవరం పనుల పరిశీలన
అనంతరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్. నాగిరెడ్డి పరిశీలించారు. స్పిల్‌వే, స్పిల్ చానల్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఎంత వరకు పనులు జరిగాయి, ఏయే పనులు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈయన వెంట మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి ఎస్.కె.బాజీ, ఎస్సీసెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కొవ్వాసి నారాయణ, వలవల సత్యనారాయణ, దేవిశెట్టి రమేష్, ఆకుల సత్యనారాయణ, దిగపాటి హరిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement