సాక్షి, ఏలూరు : సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్‌ఆర్ సీపీ నేతల బృందం గురువారం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పనుల పర్యవేక్షణకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ మాటలకు, చేతలకు పొంతన లేదు. చంద్రబాబు ఎప్పుడు అవినీతిలో ఇరుక్కున్నా.. తెరమీదకు పవన్‌ను తెచ్చి విషయాన్ని పక్కదోవ పట్టిస‍్తారు. పవన్‌ది జనసేన కాదు...భజన సేన. చంద్రబాబుది తల్లి టీడీపీ అయితే...పవన్‌ది పిల్ల టీడీపీ. అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రి అవకూడదని పవన్ అంటున్నారు. మరి పిల్లనిచ్చిన మామపై చెప్పులు విసిరి, వెన్నుపోటు పొడిచి సీఎం కావచ్చా? ఏ అర్హత లేకపోయినా ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తిని ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వొచ్చా?. అలాంటి వారికి పవన్ కల్యాణ్ భజన చేస్తారా?.
అప్పుడు ఏమయ్యావ్ పవన్..
ఏ అనుభవం ఉందని చిరంజీవి, పవన్‌లు పార్టీలు పెట్టారు. పోలవరం అవినీతిలో చంద్రబాబు కూరుకుపోగానే రిజర్వేషన‍్ల అంశాన్ని తెరపైకి తెచ్చి నాటకాలు ఆడుతున్నారు. వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు మంచి స్పందన వస్తుండటంతో మళ్లీ వపన్‌ను తెచ్చి రెండ్రోజుల కార్యక్రమాలు పెట్టారు. మేం పోలవరం వస్తున్నామని తెలియగానే పచ్చ ఛానళ్లు, చంద్రబాబు కలిసి హడావుడిగా పవన్‌ను పోలవరానికి పంపించారు. ప్రశ్నిస్తామంటున్న వ్యక్తి పుష్కరాల్లో 29మంది చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో అమాయకులు చనిపోయినప్పుడు ఏమైయ్యాడు. ఏపీలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా ఎందుకు మాట్లాడరు. పవన్ గురించి ప్రతి ఒక్కరికి అర్థమైంది.
అందుకోసమే పవన్ పార్టీ పెట్టాడు..
పవన్ ఉన్నది ప్రశ్నించడానికి కాదు...ప్యాకేజీల కోసం. చిరంజీవికి 18 సీట్లు వస్తే మధ్యలో వదిలేసిన షూటింగ్‌కు వెళ్లిపోయారు. పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఎందుకు మాట్లాడలేదు. వినేవాడు వెర్రివాడు అయితే...చెప్పేవాడు చంద్రబాబు అన్నట్లు, బాబు స్క్రిప్ట్ ప్రకారం పవన్ మాట్లాడుతున్నారు. షూటింగ్ గ్యాప్‌ల్లో వచ్చి ఇతరులపై నిందలు వేయడం సరికాదు. ప్రజల్లో ఉండి, ప్రజల తరఫున పోరాడండి. పవన్ మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. అధికారం లేకపోయినా ఏమైనా చేయొచ్చంటున్నారు. అలా అయితే రుణమాఫీ చేయండి. డ్వాక్రా రుణాలు రద్దు చేయండి. అధికారం ఉంటేనే కొన్ని పనులు చేయగలమనే విషయం తెలియదా?. అది కూడా మనసు ఉంటేనే ప్రజల కోసం ఏమైనా చేసేది.
పోలవరంపై చంద్రబాబు చేసిందేమీ లేదు
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తవ్విన కాల్వలపై పట్టిసీమ, పురుషోత్తపట్నం కట్టి కమీషన్లు దండుకుంటున్నారు. పోలవరం విషయంలో మేం చెప్పిందే జరిగింది. నేనే చెస్తానని చెప్పి చంద్రబాబు ఇప్పటివరకూ ఎందుకు ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. సబ్ కాంట్రాక్టర్లకు ఎందుకు దోచిపెడుతున్నారు. కొత్తగా మళ్లీ టెండర్లను ఎందుకు పిలుస్తున్నారు. లొసుగులు సరిచేయమని కేంద్రం అడిగితే ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే చేపట్టాలి. రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి.
చిరంజీవికి అన్యాయం చేసింది పవన్ కల్యాణే
పవన్ వారసత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. సినిమాలకు వారసత్వం వర్తించదా?. రాజకీయాలకు మాత్రమే వారసత్వం వర్తిస్తుందా? చిరంజీవి లేకపోతే పవన్‌తో ఎవరైనా సినిమాలు తీసేవారా?. అది వారసత్వం కాదా?. ఇక చిరంజీవికి అన్యాయం చేసింది పవన్ కల్యాణే. చిరంజీవి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతారో అని యువజన విభాగం బాధ్యతలు తీసుకున్న పవన్ ఆ పార్టీ 18 సీట్లు మాత్రమే గెలవడంతో అన్నను నడిరోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. పవన్ సపోర్ట్ చేస్తే చిరంజీవి పార్టీ నడిపేవారు. అన్నకు సపోర్ట్ చేయకుండా షూటింగ్‌లకు పోవడం వల్లే చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. పవన్, చిరంజీవిపై ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు అడ్డమైన రాతలు రాయించి పార్టీని విలీనం చేసే పరిస్థితి తెచ్చారు. అలాంటి వ్యక్తితో 2014లో పవన్ చేతులు కలిపారు. 2009లో అవినీతిపరుడైన చంద్రబాబు 2014లో గొప్పవ్యక్తి ఎలా అయ్యాడు. వైఎస్‌ఆర్, జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. డ్రామలాపి సినిమాలు తీసుకోవడం బెటర్.
చంద్రబాబంటే ఎందుకంత ముద్దు
గోద్రా అల్లర్ల సమయంలో నరేంద్ర మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన చంద్రబాబు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎలాగైనా గెలవాలని పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకున్నారు. విజయనగరంలో ఓ వ్యక్తి చనిపోతే పవన్ వెళ్లారు. మరి నారాయణ కాలేజీల్లో వందలమంది విద్యార్థులు చనిపోతున్నా ఎందుకు వెళ్లడం లేదు. నారాయణ, గంటా శ్రీనివాసరావు గురించి ఎందుకు మాట్లాడటం లేదు. పవన్‌కు చంద్రబాబు అంటే ఎందుకంత ముద్దు. చంద్రబాబు పవన్‌కు ఏం ప్యాకేజీలిస్తున్నారు. ముందుగా ఆ విషయాన్ని పవన్ స్పష్టం చేయాలి.’ అని అన్నారు.
పవన్ కల్యాణ్‌ది జనసేన కాదు...భజన సేన : రోజా
Comments
Please login to add a commentAdd a comment