న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలి
న్యాయమైన నష్టపరిహారం చెల్లించాలి
Published Mon, Mar 27 2017 10:31 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
–పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పోరుబాట
రంపచోడవరం : పోలవరం నిర్వాసితులకు తెలంగాణలో మాదిరి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ దేవీపట్నం మండలానికి చెందిన గ్రామస్తులు సోమవారం పెద్ద ఎత్తున రంపచోడవరంలో పోరుబాట పేరుతో ప్రదర్శన నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి ర్యాలీగా ఐటీడీఏకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లను అధికారుల ముందుంచారు. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి గ్రామాన్ని ఖాళీ చేసే తేదీని కట్‌ఆఫ్ తేదీగా నిర్ణయించాలన్నారు. ఆ సమయానికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింప చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా కొన్ని భూములు ముంపునకు గురి కావడం లేదని ఆ పొలాలకు వెళ్లేందుకు మార్గం కూడా లేని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి భూములను తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేసి భూమికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఇప్పటికే గిరిజనుల అధీనంలో ఉన్న కొండపోడు భూములకు పట్టాలు ఇచ్చి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తూ సమీపంలోని మైదాన ప్రాంతంలోని రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా భూమికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుక్కునూరులో ఎకరానికి రూ.10.50 లక్షలు చెల్లించారని తెలిపారు. అదే తరహాలో ఇక్కడ భూములకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. భూమికి భూమి ఇచ్చేటప్పుడు గిరిజనులకు కోరుకున్న, సాగుకు అనుకూలమైనవి ఇవ్వాలన్నారు. ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. కుంజం చెల్లన్నదొర, మట్టా రాంబాబు, సర్పంచ్‌లు సోదే వెంకన్నదొర, సుభద్ర, నాయకులు శిరసం పెదబ్బాయిదొర, మానెం సుబ్రమణ్యం, పెదబాబు, కొమరం పోశమ్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement