ఐదోరోజూ అదే ఉత్సాహం
మచిలీపట్నం : పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఐదోరోజూ శుక్రవారం కూడా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగాయి. అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల ఎంపిక ప్రక్రియను ఎస్పీ జి.విజయకుమార్, మచిలీపట్నం డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తదితరులు పర్యవేక్షించారు. తొలుత 1,600 మీటర్ల పరుగుపందెం అనంతరం లాంగ్‌జంప్, ఆ తరువాత 100 మీటర్ల పరుగుపందేన్ని విడతలవారీగా నిర్వహించారు. పరుగుపందెం పోటీల్లో అస్వస్థతకు గురైన వారికి ప్రత్యేక వైద్యశిబింలో వైద్యసేవలు అందించారు.
పక్కాగా వివరాలు నమోదు
పోలీస్ కానిస్టేబుల్ ఎంపికను పురస్కరించుకుని పరుగుపందెం పోటీలను సెన్సార్ ద్వారా నమోదు చేస్తున్నారు. చెన్నైకు చెందిన ఒలింపియాన్ టెక్ సంస్థకు పరుగుపందెం పోటీలను నమోదుచేసే పనిని అప్పగించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా అభ్యర్థుల పరుగుపందేన్ని నమోదు చేస్తున్నారు. ప్రతి అభ్యర్థికి ఒక నంబరు కేటాయిస్తున్నారు. ఆ నంబరు ఉన్న పచ్చరంగు జాకెట్‌ను అందజేస్తున్నారు. ఈ జాకెట్‌కు రెండు భుజాలపైనా ప్రత్యేక చిప్‌లను అమర్చారు. ఈ చిప్ ఆధారంగా అభ్యర్థి ఎంత సమయంలో పరుగుపందేన్ని పూర్తిచేశాడో సెకనుతో సహా సెన్సార్ సేకరించి ఆ వివరాలను కంప్యూటర్‌కు పంపుతుంది. దీని ఆధారంగా అభ్యర్థులు పరుగుపందెం పూర్తిచేసిన సమయాన్ని బట్టీ మార్కులను కేటాయిస్తున్నారు. సెన్సార్ నమోదులో ఏమైనా తేడాలు ఉంటే సీసీ కెమెరాల ద్వారా అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పరుగుపందెం పోటీల నమోదు జరుగుతోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.