ఉగ్రకదలికలపై పోలీసు నిఘా
– రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు
– నగరంలో డీఎస్పీ విస్తృత పర్యటన
కర్నూలు: ఉగ్రవాదుల కదలికలపై జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకొని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి నేతత్వంలో నగరమంతా సోదాలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సీఐలు ములకన్న, నాగరాజు రావు, మహేశ్వర్‌రెడ్డి, మధుసూదన్‌రావు సిబ్బందితో వారి స్టేషన్ల పరిధితో పాటు రైల్వే స్టేషన్, కొత్తబస్టాండు, రాజ్‌విహార్, మౌర్యాఇన్ సర్కిల్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు విస్తతంగా తనిఖీలు చేపట్టారు. సబ్ డివిజన్ అధికారులను డీఎస్పీ అప్రమత్తం చేస్తూనే బస్టాండు, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లు, రాజ్‌విహార్‌తో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో డీఎస్పీ పర్యటించి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ కొత్త వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయాలని సీఐలను ఆదేశించారు. వాహనాల తనిఖీతో పాటు వ్యాపార దుకాణ దారులను అప్రమత్తం చేశారు.