ఇకపై పోలీసుల చేతుల్లో నిఘా నేత్రం
ఇకపై పోలీసుల చేతుల్లో నిఘా నేత్రం
Published Fri, Oct 7 2016 10:59 PM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM
– జిల్లాకు 15 సోనీ హ్యాండ్ కెమెరాలు కేటాయింపు
– అల్లర్లు, ఉత్సవాలు, రాస్తారోకోలు, ధర్నాలపై వీటితో నిఘా
– పనితీరును పరిశీలించిన ఎస్పీ
కర్నూలు : నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డీజీపీ కార్యాలయం నుంచి జిల్లాకు 15 సోనీ హ్యాండీ కెమెరాలు వచ్చాయి. గత నెలలో జిల్లాకు నాలుగు డ్రోన్ కెమెరాలను కేటాయించిన సంగతి తెలిసిందే.వీటి నిఘాతో పోలీసులు అసాంఘిక శక్తుల ఆట కట్టించనున్నారు. రద్దీ, జన సమూహ, ఎత్తు ప్రదేశాల్లో జరిగే నేరాలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించనున్నారు. వాటి వినియోగంపై ఇద్దరు ఎస్‌ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు శిక్షణ కూడా పొందారు. పోలీసుల చేతుల్లో ఇకపై నిఘా నేత్రాలు ఉంటాయి. అల్లర్లు, ఉత్సవాలు, రాస్తారోకోలు, ధర్నాలను హ్యాండ్ కెమెరాలతో చిత్రీకరించనున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు హ్యాండ్ కెమెరాలతో రహస్యంగా షూట్ చేసి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి హ్యాండ్ కెమెరాలు ఉపయోగపడతాయని ఎస్పీ ఆకె రవికృష్ణ అభిప్రాయపడ్డారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హ్యాండ్ కెమెరాల పనితీరును ఆయన పరిశీలించి ప్రారంభించారు. ధర్నాలు, రాస్తారోకోలు, అల్లర్లు, ఉత్సవాల వద్ద బందోబస్తు విధుల్లో ఉండే కానిస్టేబుళ్లు ఇకపై వీటిని ఖచ్చితంగా వినియోగిస్తారని వెల్లడించారు. హ్యాండ్ కెమెరాలను డీఎస్పీ, క్రైం బ్రాంచ్ కార్యాలయాలకు కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, మురళీధర్, వెంకటాద్రి, సుప్రజ, కొల్లి శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, హరినాథరెడ్డి, వినోద్‌కుమార్, బాబుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement