
నకిలీ విత్తనాలపై నిఘా
► సమాచారం ఇవ్వండి
► వాట్సప్ నంబరు 8333986898
► ఎస్పీ ఎం.శ్రీనివాస్
ఆదిలబాద్: జిల్లాలో రైతులకు విక్రయించే నకిలీ విత్తనాలపై నిఘా ఉంచామని, ఎవరైనా విక్రయిస్తే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఎం.శ్రీనివాస్ సూచించారు. గురువారం పోలీసు కార్యాలయం నుంచి పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందని, ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అన్ని మండలాలు, పట్టణాల్లో ఎరువులు, విత్తనాల దుకాణాల్లో పోలీసులు దాడులు నిర్వహించాలని సూచించారు. బాధ్యులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని అన్నారు. రైతులకు అండగా పోలీసులు ఉన్నారని, ఎటువంటి సమాచారం ఉన్నా డయల్ 100 లేదా, 8333986898కు సమాచారం అందించాలని, లేనిపక్షంలో నేరుగా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. అమాయక రైతులను మోసం చేయడానికి ఎవరు ప్రయత్నించినా, తక్కువ ధర ఉందని ప్రలోభ పెట్టిన, విక్రయించిన నేరంగా పరిగణిస్తామని పేర్కొన్నారు.
ఎరువులు, విత్తనాలు, గోదాముల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. రైతులు విత్తనాలు కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. కొనుగోలు చేసిన అనంతరం దుకాణదారుని పేరు మీద ఉన్న ఒరిజనల్ రసీదు తీసుకోవాలని, రసీదుపై కొనుగోలు చేసిన విత్తనాల పేర్లు లిఖించి ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లేందుకు పోలీసులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు బి. ప్రవీణ్, అన్వర్ ఉల్‌హఖ్, జి.రామన్న, సంజీవ్ పాల్గొన్నారు.