ప్రజల అభిమానాన్ని చురగొంటున్న పోలీసు సేవాదళ్
- కొనియాడిన జిల్లా ఎస్పీ
– స్టేట్‌బ్యాంకు వద్ద ఖాతాదారులకు పెరుగన్నం పంపిణీ
కర్నూలు: పోలీస్ సేవాదళ్ క్రమశిక్షణకు, నిబద్ధతతకు మారుపేరుగా నిలవ్వడమే కాక సేవాకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని ప్రజల అభిమానాన్ని చురగొంటుందని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ కొనియాడారు. సద్గురు దత్త కృపాలయం ఆధ్వర్యంలో నగరంలోని ఎస్వీ కాంప్లెక్స్ పక్కనగల ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచి వద్ద గంటల తరబడి క్యూలో నిలిచి ఉన్న ఖాతాదారులకు మంగళవారం మధ్యాహ్నం సద్గురుదత్త సిబ్బంది, పోలీసు సేవాదళ్, బ్యాంకు మేనేజర్లు కలిసి పెరగన్నం, వాటర్‌ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రూ.500, రూ.1000 నోట్లు రద్దుతో వాటిని మారు్చకునేందుకు ఖాతాదారులు క్యూ కడుతున్నారన్నారు. వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సద్గురుదత్త కృపాలయం పెరుగన్నం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడానికి ముందుకొచ్చిందన్నారు. ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీఐలోనే కాకుండా, నగరంలోని వివిధ బ్యాంకుల బ్రాంచీల్లో అవసరాన్ని బట్టి పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా బ్యాంకుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. ప్రజల్లో విశ్వాసం, ధైర్యం కలిగించే విధంగా పోలీస్ సేవాదళ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారని చెప్పారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, ఎస్‌బీఐ అసిస్టెంటు జనరల్ మేనేజర్ మురళీధర్, సీఐలు డేగల ప్రభాకర్, నాగరాజరావు, సద్గురుదత్త కృపాలయ వైస్ ప్రసిడెంట్ శ్రీనివాసరావు, పోలీసు సేవాదళ్ సిబ్బంది ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.