పోలీసులే దొంగలుగా మారారు...
నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీసులు దొంగలుగా మారారు. మేతకోసం వచ్చిన మేకలను ఎత్తుకెళ్లి అమ్ముకున్నారు. వీరి నిర్వాకంతో కంగుతిన్న మేకల యజమాని వేరే గత్యంతరం లేక ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిజంగానే పోలీసులు మేకలు అమ్మకున్నారని తెలిసింది. ఈ విషయం బయటకు తెలిసి జనాలు ఫక్కుమని నవ్వుతున్నారు.
అయితే పూర్తి వివరాల్లోకి వెళితే..
సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్ ఊరి మధ్యలో ఉంది. ఇదే గ్రామానికి చెందిన రాపర్తి జయమ్మకు భర్త లేడు. కూలీనాలి చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమెకు నాలుగు మేకలున్నాయి. హరితహారంలో భాగంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ మేకలు పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి రావడంతో పోలీసులు వాటిని బంధించారు. జయమ్మ పోలీస్‌స్టేషన్‌కు రావడంతో మేకలను ఇటువైపు రాకుండా చూడాలని హెచ్చరించి వదిలేశారు. మళ్లీ 15 రోజులకు మేకలు వచ్చాయి. నాలుగు మేకలను బంధించిన పోలీసులు ఆ వెంటనే రూ.20వేలకు విక్రయించారు. దీంతో సదరు మహిళ ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా పోలీసు అధికారులు రహస్యంగా విచారణ జరిపారు.
విచారణలో నిగ్గు తేలిన నిజాలు..
భువనగిరి సబ్‌డివిజన్ పోలీసు అధికారులు గత మూడు రోజులుగా మేకల విక్రయంపై విచారణ జరుపుతున్నారు. సదరు మహిళను పిలిచి విచారించారు. మేకలను పోలీసులే అమ్మినట్టు తేలింది. పోలీసు ఉన్నతాధికారులకు విషయం చేరడంతో, ఆమెకు స్థానిక పోలీసులు మేకలను అమ్మగా వచ్చిన డబ్బును అందజేశారు. ఈమె ఈ డబ్బులను విచారణకు వచ్చిన పోలీసు అధికారికి అప్పగించినట్టు తెలిసింది.