పార్టీ జెండా పేరుతో పోలీసుల అరాచకం
చుండూరు సీఐపై చర్యలకు దళిత, ప్రజాసంఘాల డిమాండ్
తెనాలి: వేమూరు నియోజకవర్గం చుండూరులో చలిమంటలో తెలుగుదేశం పార్టీ జెండాను వేశారనే ఆరోపణతో పోలీసులు దళిత యువకులను పోలీస్‌స్టేషనులో నిర్బంధించి, కొట్టిన దారుణంపై విచారణ జరిపించాలని వివిధ దళిత, ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు. మైనారిటీ తీరని బాలలను సైతం హింసించి, కులం పేరుతో దూషించిన చుండూరు సీఐను విధుల నుంచి తప్పించాలని, ఆమెపై ఎట్రాసిటీ కేసు నమోదుచేయాలని లేకుంటే దళిత సంఘాలతో కలిసి రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న చుండూరు దళిత యువకులను కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, జిల్లా కార్యదర్శి టి.కృష్ణమోహన్, డివిజన్ కార్యదర్శి బి.అగస్టీన్, 'సాధన' రాష్ట్ర కన్వీనర్ మాతంగి దిలీప్‌కుమార్, బహుజన రక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్ కొక్కిలిగడ్డ, సీపీఎం డివిజన్ కార్యదర్శి ములకా శివసాంబిరెడ్డి, చుండూరు దళిత బాధితుల పోరాట కమిటీ అధ్యక్షుడు జాలాది మోజెస్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. వైద్యశాల ఆవరణలో వారు విలేకర్లతో మాట్లాడారు. 30న చుండూరులో జరిగిన ఘటన కేవలం సీఐ, ఎస్‌ఐలు అధికార తెలుగుదేశం పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరించిన కారణంగానే జరిగిందని ఆరోపించారు. పార్టీ జెండాను తగులబెట్టారో? లేదో? గాని రెండురోజులపాటు ఇంకో కులంవారినైతే పోలీస్‌స్టేషనులో నిర్బంధించగలిగేవారా? అని మాల్యాద్రి ప్రశ్నించారు. పైగా సీఐ సుభాషిణి కులంపేరుతో దూషించి, మోటారుబైకులు కావాలా? అంటూ కించపరచేలా మాట్లాడటం సహించరాని విషయంగా ఆరోపించారు. పోలీసు దెబ్బలకు చలిమంట వేశామని అంగీకరించిన యువకులను వదిలేసి, ఒప్పుకోనివారిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేయటం మరో దుర్గార్మంగా వ్యాఖ్యానించారు. దళిత యువకుల నిర్బంధం, హింసలో అధికార అహంకారం స్పష్టంగా కనిపిస్తోందనీ, అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం చుదువుకునే యువకులను కూడా బలిచేశారని ఆరోపించారు.