
పొంగిపొర్లుతున్న చెరువులు
భూదాన్‌పోచంపల్లి : మండలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. మండల కేంద్రంలోని సినిమా థియేటర్ వద్ద వర్షపునీరు నిలవడంతో మెయిన్‌రోడ్డు మడుగును తలపించింది. కనుముకుల చెరువు అలుగు పోస్తుండటంతో 50 ఎకరాలు, ముక్తాపూర్‌లో సుమారు 20 ఎకరాలపైన వరినీటి మునిగింది. రేవనపల్లి, గౌస్‌కొండ గ్రామాల్లో కాలువలకు గండి పడటంతో మరో 20 ఎకరాలపైన వరిపొలాలు నీటి మునిగాయి. జంట నగరాల నుంచి వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తుండంతో మండలంలో మూసీ పరవళ్లు తొక్కుతోంది. పిలాయిపల్లి, జూలూరు, పెద్దరావులపల్లి గ్రామాల మధ్య గల బ్రిడ్జిలపై నుంచి మూసీ ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండలం నుంచి ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరికి వెళ్లడానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని చెరువులన్నీ నిండి అలుగుపోస్తున్నాయి. పోచంపల్లి చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ మార్గంలో వెళ్లే రేవనపల్లి, శివారెడ్డిగూడెం, ఇంద్రియాల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే భీమనపల్లి చెరువు అలుగు పారి నీరంతా రోడ్డు పైకి చేరింది. జిబ్లక్‌పల్లిలో చిక్క అఖిల, అంతమ్మగూడెంలో రావుల లింగయ్యకు చెందిన ఇళ్లు కూలిపోయాయని వీఆర్వో షేక్ చాంద్‌పాష తెలిపారు. కాగా మండలంలో వర్షపాతం 54.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.