ఇంకెన్నడో? | posts not fill in tb section | Sakshi
Sakshi News home page

ఇంకెన్నడో?

Published Wed, Apr 5 2017 10:54 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ఇంకెన్నడో? - Sakshi

ఇంకెన్నడో?

– క్షయ నివారణ సొసైటీలో భర్తీకి నోచుకోని పోస్టులు
– ఏడాది క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చినా ఫలితం శూన్యం
– అదిగో..ఇదిగో అంటూ ఊరిస్తున్న అధికారులు
– ఎడతెగని జాప్యంపై అభ్యర్థుల్లో ఆందోళన  


వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. నోటిఫికేషన్‌ ఇచ్చి ఏడాది అవుతున్నా ఇప్పటికీ పోస్టులు భర్తీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. దరఖాస్తుల స్వీకరణ నుంచి మెరిట్‌ జాబితా సిద్ధం చేసే వరకు అన్ని ప్రక్రియలు ముగిసినా ఎందుకనో జాబితాను మాత్రం విడుదల చేయడం లేదు. ఫలితంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
- అనంతపురం మెడికల్‌

జిల్లా క్షయ నివారణ అధికారి కార్యాలయం పరిధిలో 20 పోస్టుల భర్తీ కోసం గత ఏడాది మార్చిలో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 11 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 20 పోస్టులకు 464 దరఖాస్తులు వచ్చాయి. ఒక సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు ఎనిమిది మంది, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ పోస్టుకు 45, టీబీ కౌన్సిలర్‌ పోస్టుకు 42, టీబీ స్టాటిస్టికల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు 58 దరఖాస్తులు వచ్చాయి. 11 సీనియర్‌ టీబీ సూపర్‌వైజర్‌ పోస్టులకు 138, రెండు టీబీ హెల్త్‌ విజిటర్‌ పోస్టులకు 62, రెండు ల్యాబ్‌ టెక్నీషియన్లకు 93, ఒక అకౌంటెంట్‌ పోస్టుకు 18 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను స్క్రూటినీ చేశాక మెరిట్‌æ జాబితాను డీఎంహెచ్‌ఓ, జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి కార్యాలయాల్లో ప్రదర్శించాల్సి ఉంది.

జాబితా విడుదలలో నిర్లక్ష్యం
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దరఖాస్తుల్ని పరిశీలించి జనరల్‌ మెరిట్‌ లిస్ట్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే విడుదలలో మాత్రం ఎడతెగని జాప్యం చేస్తున్నారు. దీంతో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు అభ్యర్థులు గ్రీవెన్స్‌కు సైతం వెళ్తున్నారు. మరికొందరు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వెంకటరమణ, డీటీసీఓ డాక్టర్‌ సుధీర్‌బాబును కలుస్తున్నారు. అయితే వారి నుంచి సరైన స్పందన మాత్రం రావడం లేదు. జాబితా విడుదలలో జాప్యంపై గతంలోనే జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ సైతం ఆరా తీశారు. వారం రోజుల్లో జాబితా తెస్తామని చెప్పిన అధికారులు నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు.
    
వాస్తవానికి మూడేళ్ల క్రితం ఇదే శాఖలో విడుదలైన నోటిఫికేషన్‌ రద్దయింది. ఆ తర్వాత మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం క్షయ వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది. కనీసం పోస్టులు భర్తీ అయితే కొద్ది మేరకైనా సేవలు మెరుగయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా ఆలోచన చేస్తే అటు రోగులకు.. ఇటు నిరుద్యోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

త్వరలోనే జాబితా విడుదల
మెరిట్‌ జాబితాను సిద్ధం చేశాం. ఇప్పటికే జేసీ–2 ఖాజామొహిద్దీన్‌ పరిశీలించారు. కొన్ని సూచనలు చేయగా కరెక‌్షన్‌ చేశాం. అంతలోనే ఆయన సెలవులో వెళ్లడం.. ఎన్నికల కోడ్‌ రావడంతో జాప్యం జరిగింది. రెండు, మూడ్రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తాం. అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– డాక్టర్‌ రావెల సుధీర్‌బాబు, జిల్లా క్షయ నివారణ అధికారి, అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement