కొత్త రాష్ట్రం.. కరువు జిల్లా..
వానలు లేక వ్యవసాయం పాడెక్కింది
ఉపాధి లేక వలసల దోవ పెరిగింది
భారీ పరిశ్రమల హామీ కొండెక్కింది
పల్లెల్లో అసహనం.. అశాంతి.. ఆకలి
కొత్త ప్రభుత్వ పాలనలో అంతా నిస్తేజం
అంధకారంలో చిరుదీపంలా
కేంద్ర ప్రభుత్వ ఆశ ‘పీఎంఈజీపీ’
పలు ప్రాజెక్టులతో గ్రామీణ.. పట్టణ
ప్రాంతాల్లో ఉద్యోగాల అవకాశం కల్పించే
ఉన్నత పథకం.. నిన్నటిదాకా..
అదీ ఘాడనిద్రలోనే ఉంది
నీతి ఆయోగ్ బృందం తాజా పర్యటన
ఉపాధి అవకాశాలపై ఊహల విమానం ఎక్కిస్తోంది..!
ఒంగోలు: ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం(పీఎంఈజీపీ)ను గ్రామాలతో పాటు పట్టణాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు 2008లో కేంద్రం ఉనికిలోకి తెచ్చింది. వివిధ రకాల ప్రాజెక్టులను లబ్ధిదారులే ఎంపిక చేసుకోవాలి.అయితే దీనిపై మొదటి నుంచి నిర్లిప్త ధోరణే కొనసాగుతోంది. యూనిట్ల సంఖ్య నుంచి పథకం ఉనికిపై నిరుద్యోగులకు ఎన్నో సందేహాలు. మరుసటి సంవత్సరమే జిల్లా పరిశ్రమల కేంద్రానికి బాధ్యతలు అప్పగించారు.
కేటాయింపుల్లోనే నిర్లక్ష్యం..
మొదటి ఆర్థిక సంవత్సరం 2019–10లో జిల్లాకు 104 యూనిట్లను లక్ష్యాన్ని నిర్దేశించి రూ.112.29 కోట్లు మంజూరు చేశారు. 2010–11లో 113 యూట్లను టార్గెట్ ఇచ్చి రూ.135.37 కోట్లను మాత్రమే మార్జిన్ నిధిగా ఇచ్చారు. 2011–12 వచ్చేసరికి అసలు యూనిట్లనే కేటాయించలేదు. ఆ తరువాత ఏడాది కేవలం 55 యూనిట్లను మాత్రమే మంజూరు చేసి.. రూ.126. 32 కోట్లు విడుదల చేశారు. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 76 యూనిట్లను మంజూరు చేయగా రూ.107.17 కోట్లు కేటాయించారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో మళ్లీ 76 యూనిట్లు టార్గెట్ ఇచ్చి రూ.108. 04 కోట్లను మార్జిన్ నిధిగా చూపించారు. కాగా గత ఏడాది కేవలం 32 యూనిట్లను మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు.
విధివిధానాలు ఏవీ?
ఈ ఏడాది ఈ పథకం లక్ష్యాల అమలకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రతి సారీ ఇదే తంతు కొనసాగుతుండటంతో ఔత్సాహికులు నిరుత్సాహ పడుతున్నారు. కానీ కొంతమంది నిరుద్యోగులు మాత్రం ఈ ఏడాది కూడా ఆన్‌లైన్‌ల∙దరఖాస్తు మాత్రం చేసుకుంటున్నారు. దీంతో జిల్లా పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్ నుంచి నీతి ఆయోగ్ బృందం సభ్యులు మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించారు. నీతి ఆయోగ్ సీనియర్ రీసెర్చ్ అధికారి పి.జె. రాధాకృష్ణ, మరో ఇద్దరు సభ్యులు జిల్లా డీఐసీ అధికారులతో కలిసి విడివిడిగా పర్యటించారు.
నేరుగా..
కందుకూరు డివిజన్, సింగరాయకొండ, ఒంగోలు డివిజన్‌లో ఒంగోలు, ఒంగోలు రూరల్, చీరాల డివిజన్‌లో శుక్రవారం పర్యటించి క్షేత్రస్థాయిలో యూనిట్లను తని ఖీలు చేశారు. గత నాలుగేళ్లుగా యూనిట్లు నెలకొల్పిన లబ్ధిదారులతో మాట్లాడారు. ఖాతాల లావాదేవీలు, నిర్వహణ, నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి దాకా స్తబ్ధుగా ఉన్న కేంద్రంలో ఒక్కసారిగా కదలిక రావడంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
జిల్లాకు స్థానం
ఈ పథకం కింద 12 రాష్ట్రాలను కేంద్రం ఎంపిక చేసింది. కాగా ఏపీలో ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చోటు దక్కింది. ఈ జిల్లాల్లో అమలవుతున్న పీఎంఈజీపీ పథకం తీరుతెన్నులపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరడంతో ఈ పరిణామం సంభవించింది. జిల్లా పరిశ్రమల కేంద్రం పరిధిలోనే కేవీఐసీ, కేవీఐబీ స్కీంలను కూడా అమలు చేయాలని డిక్కీ ప్రతినిధి బృందం నీతి ఆయోగ్ కమిటీకి తెలియజేశారు. యూనిట్ల సంఖ్యను పెంచి జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదిస్తామని డిక్కీ ప్రతినిధి భక్తవత్సలం తెలిపారు.
ఉపాధి 'ఆశలు'..!
Published Mon, Oct 24 2016 12:19 PM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM
Advertisement