ఇకపై ప్రీపెయిడ్ కరెంట్!
Published Sat, Jul 30 2016 7:22 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : విద్యుత్ బిల్లులు జారీ, వినియోగదారుల నుంచి వాటిని కట్టించుకోవడానికి ప్రత్యేక విభాగాల నిర్వహణ వంటి తల నొప్పులకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చెక్ పెట్టనుంది. విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానాన్ని అమలు చేయనుంది. వినియోగదారులు ముందుగా రీచార్జ్ చేసుకుంటేనే కరెంటు సరఫరా చేయాలని చూస్తోంది. దీనివల్ల బకాయిల బాధ కూడా తప్పుతోంది. ఇప్పటికే వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, బడా పారిశ్రామికవేత్తల నుంచి రూ.కోట్లలో బిల్లులు వసూలు కావాల్సి ఉంది. కొందరైతే కోర్టులకు వెళ్లి మరింత తాత్సారం చేస్తున్నారు. వీటన్నింటికీ ప్రీపెయిడ్ విధానమే సరైనదని, ఆ దిశగా నూతన విధానం అమలుకు విద్యుత్ సంస్థ కార్యాచరణ రూపొందిస్తోంది.
ప్రీ పెయిడ్ మీటర్లు అమర్చుతారు
ప్రస్తుతం ఉన్న సర్వీసులకు అమర్చిన మెకానికల్, ఎలక్ట్రానిక్ విద్యుత్ మీటర్లు తొలగించి వాటి స్థానంలో ప్రీపెయిడ్ మీటర్లు అమర్చేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. మొదటగా విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలకు బిగించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. దీని నిమిత్తం సంస్థ ఇప్పటికే సుమారు 10 వేల మీటర్లను కొనుగోలు చేసినట్టు తెలిసింది.
దుబారాకు కళ్లెం
నూతన విధానంలో విద్యుత్ దుబారాకు కూడా కళ్లెం పడనుందని అధికారుల అభిప్రాయం. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఈ విధానం ద్వారా డిస్కంలు నష్టాల నుంచి గట్టెక్కినట్టు సంస్థ ఉన్నతాధికారులు గుర్తించారు. అదే తరహాలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లను అమర్చడం ద్వారా విద్యుత్ దుబారాకు కళ్లెం వేయవచ్చని భావిస్తున్నారు. ఎవరికి కావాల్సినంత రీచార్జ్ వారు చేసుకుని విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తారని, తద్వారా దుబారా తగ్గుతుందని అంటున్నారు. సెల్‌ఫోన్‌లో రీచార్జ్ అయిపోయిన వెంటనే మాట్లాడుతుండగానే లైన్ ఎలా కట్ అయిపోతుందో ఈ కొత్త విధానంలో విద్యుత్ సరఫరా కూడా రీచార్జ్ అయిపోయిన వెంటనే సరఫరా నిలిచిపోతుంది. అందువల్ల వినియోగదారుడు ఎప్పటికప్పుడు అప్రమత్తమై కొంత మొత్తం ఉండగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా పనిచేస్తుంది..
పాత మీటర్లు తొలగించి వాటి స్థానంలో ప్రత్యేక మీటరును అమర్చుతారు. ఈ మీటరుకు ఒక సిమ్ కార్డును అనుసంధానం చేస్తారు. దీంతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎటువంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. మీటరుకు అయ్యే ఖర్చును పూర్తిగా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థే భరిస్తుంది. ఈ విధానం వల్ల బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానం వినియోగదారునికి లేకుండా, బిల్లు వసూలు అవుతుందా లేదా? అనే సందేహం సంస్థకు లేకుండా అటు వినియోగదారులకు, ఇటు సంస్థకు ఉభయతారకంగా పనిచేస్తుందని భావిస్తున్నారు.
Advertisement
Advertisement