
ఖైదీల క్షమాభిక్షకు సన్నాహాలు
♦ నాలుగేళ్లుగా విడుదలకు నోచుకోని వైనం
♦ సుప్రీం తీర్పు నేపథ్యంలో
♦ మార్గదర్శకాల కోసం కమిటీ
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా క్షమాభిక్షకు నోచుకోక జైళ్లలో మగ్గుతున్న జీవిత ఖైదీలకు తీపి కబురు. జైళ్లలో సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించే క్షమాభిక్షకు సన్నాహాలు మొదలయ్యాయి. ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే క్షమాభిక్షకు సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. క్షమాభిక్షపై నిషేధాన్ని తొలగిస్తూ మార్గదర్శకాలను సూచించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం తీర్పునకు అనుసరించి నియమ నిబంధనలు రూపొందించాలని జైళ్ల శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీని కోసం అన్ని జైళ్ల సూపరింటెండెంట్‌లు సభ్యులుగా జైళ్ల శాఖ ఒక కమిటీ వేసింది.
రెండు నెలల్లోగా ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. నియమ నిబంధనలను రూపొందించడంతో పాటు అర్హులైన ఖైదీలను కమిటీ తేల్చనుంది. కమిటీ నివేదికను ప్రభుత్వం యథావిధిగా ఆమోదిస్తే ఖైదీల సంఖ్యను సులభంగా ప్రకటించవచ్చని జైళ్ల శాఖ భావిస్తోంది. ప్రభుత్వం ఏమైనా మార్పులు సూచించినా వెంటనే చేయవచ్చని అంచనా వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని అన్ని జైళ్లలో శిక్షపడిన ఖైదీలు 1,800 మంది వ రకు ఉంటారని, వీరిలో వందల మందికి విడుదలకు అర్హత లభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల క్షమాభిక్ష ఉండవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా నిరాశే..!
కొంతమంది ఆవేశంతో లేక మరే ఇతర వ్యాపకాలతో చేసే నేరాలకు జీవిత ఖైదీగా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వారు జైళ్లలో కొంత కాలం తర్వాత పశ్చాతాపపడి సత్ప్రవర్తనతో మెలుగుతున్నారు. ఇలాంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించేది. ఉమ్మడి రాష్ట్రంలో పదిహేడు సార్లు ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. చివరగా 2011లో కొన్ని నేరాలకు మినహాయింపు ఇచ్చి కొంతమంది ఖైదీలను మాత్రమే క్షమాభిక్షపై విడుదల చేశా రు. తర్వాత పలుమార్లు క్షమాభిక్ష ప్రస్తావన వచ్చిన ప్పటికీ పలు కారణాలతో ప్రక్రియ నిలిచిపోయింది.
రెండు మాసాల్లో కొలిక్కి: జైళ్ల శాఖ డీఐజీ
రెండు నెలల్లో ఖైదీల క్షమాభిక్ష అంశం కొలిక్కి రానున్నట్లు రాష్ట్ర జైళ్ల శాఖ హైదరాబాద్ రీజియన్ డీఐజీ నర్సింహ స్పష్టం చేశారు. కమిటీ నివేదికను ప్రభుత్వం ముందుంచి క్షమాభిక్షపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. శనివారం చర్లపల్లి కేంద్ర కారాగారంలో ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఖైదీలు, జైళ్ల శాఖ ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఖైదీల్లో పరివర్తన తేవడానికి చేపట్టిన మహాపరివర్తన కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ దేశంలోనే అవినీతిరహిత శాఖగా గుర్తింపు సాధించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు.