‘నులి’ పేద్దాం.!
‘నులి’ పేద్దాం.!
Published Tue, Aug 30 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
– నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినం
– జిల్లాలో 7,90,273 మందికి మాత్రల పంపిణీకి ఏర్పాట్లు
కర్నూలు(హాస్పిటల్): చేతులను శుభ్రం చేసుకోవడం అనే విషయం చూడ్డానికి చిన్నదైనా, అది పాటిస్తే 60 రకాల వ్యాధులను దరిచేరకుండా చేయవచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రతి ఏడాది ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా అవి క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరడం లేదు. ఫలితంగా ఇప్పటికీ కడుపులో నులిపురుగుల సమస్యతో అనేక మంది చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. నులిపురుగుల కారణంగా పలు రకాల వ్యాధులు సోకి అల్లాడుతున్నారు. దీనిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదిన ‘జాతీయ నులిపురుగుల నివారణ దినం’గా పేర్కొంటూ జిల్లా వ్యాప్తంగా పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఇంటర్ మీడియట్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని విస్తతంగా చేపట్టనున్నారు.
నులి పురుగుల ఎలా వ్యాపిస్తాయి
శరీరంలో నులిపురుగులు ఉన్న పిల్లవాడు తన మలంతో నేలను కలుషితం చేస్తాడు. ఈ గుడ్లు నేలలో లార్వాలుగా వృద్ధి చెందుతాయి. మిగతా పిల్లలు ఈ గుడ్లను ఆహారం, మురికిచేతుల ద్వారా చర్మం లోపలికి లార్వా చొచ్చుకుపోవడం వల్ల నులిపురుగుల సంక్రమణం జరుగుతుంది. ఈ క్రిములు క్రమంగా అభివృద్ధి చెంది తిరిగి గుడ్లను ఉత్పత్తి చేసి, పిల్లలకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
పిల్లల ఆరోగ్యంపై ప్రభావం
రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, మలంలో రక్తం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తాయి. పిల్లల్లో నులిపురుగుల సంక్రమణం ఎంత ఎక్కువగా ఉంటే వ్యాధి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి.
నులి పురుగుల నివారణ ఇలా..
1.బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకూడదు.ఎల్లప్పుడూ మరుగుదొడ్డినే వాడాలి.
2. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
3. బూట్లు, చెప్పులు ధరించాలి
4. గోర్లను శుభ్రంగా, చిన్నవిగా కత్తిరించుకోవాలి.
5. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే తాగాలి. ఆహారాన్ని కప్పి ఉంచాలి.
6. పండ్లను, కూరగాయలను శుభ్రమైన నీటితో కడగాలి.
7. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
జిల్లాలో 7,90,273 మంది పిల్లలకు మాత్రలు
జిల్లాలో ఒకటి నుంచి 5 ఏళ్ల పిల్లల సంఖ్య అంగన్‌వాడీ కేంద్రాల్లో 2,66,251, 10 నుంచి 19 ఏళ్ల వయస్సు(చదువుకు వెళ్లని, ఇండ్ల వద్ద ఉన్న) వారి సంఖ్య 65,763, ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 4,58,259 మంది కలిపి మొత్తం 7,90,273 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం నులిపురుగుల నివారణ కోసం మాత్రలు వేయనుంది. ఒకటి నుంచి రెండేళ్ల పిల్లలకు సగం మాత్ర, 2 నుంచి 5 ఏళ్లు పిల్లలకు, ఆపై వయస్సు వారికి ఒక మాత్ర చొప్పున ఇవ్వనున్నాం. ఈ మేరకు విద్య, ఎస్‌ఎస్‌ఏ, ఐసీడీఎస్, అనియత విద్య, వికలాంగుల సంక్షేమ శాఖ, డీఆర్‌డీఏ, సాంఘిక సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకోనుంది.
– డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ
Advertisement