ధరలపై దండయాత్ర
- వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు
ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు.... అంటూ సగటు జీవులు వ్యథాభరిత గేయాలు పాడుకుంటున్నారు. సర్కారువారి ధరాఘాతాలకు విలవిల్లాడుతున్నారు. ఏడాది వ్యవధిలో ఎన్నో రెట్లు పెరిగిపోయిన సరకుల ధరలు సామాన్య ప్రజలనే కాదు మధ్యతరగతి వేతన జీవులనూ వణికిస్తున్నాయి. కూటి కోసం కూలీనాలీ చేసుకునే వారి జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. ధరలకు కళ్లెం వేయాల్సిన రాష్ర్టప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
రాష్ర్టప్రభుత్వ వ్యవహారశైలికి నిరసనగా ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం రాష్ర్టవ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. అనేక చోట్ల నిరసన ప్రదర్శనలూ జరిగాయి. ఈ కార్యక్రమాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్యప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సర్కారు తీరుపై నిరసన గళం వినిపించారు. ధరలను అదుపుచేయాలంటూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు.
-సాక్షి నెట్‌వర్క్
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు. శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి కార్యాలయ ప్రతినిధికి వినతిపత్రం అందజేశారు.ఆమదాలవలసలో పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో మండల నాయకులు భారీగా ఆందోళన నిర్వహించారు. పాతపట్నంలో ఎమ్మెల్యే వెంకటరమణ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు.
రాజాంలో కంబాల జోగులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు నాయకత్వం వహించారు. పోలవరం ఏటిగట్టు వద్ద మానవహారం నిర్వహించి, అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు నాయకత్వం వహించారు. ఆచంటలో జరిగిన ధర్నాలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, కార్యకర్తలు ఆందోళన చేశారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యుడు కుడుపూడి చిట్టబ్బాయిల ఆధ్వర్యంలో అమలాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. రాజానగరంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విశాఖ జిల్లా పాడేరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు నియోజకవర్గంలోని చీడికాడ, దేవారపల్లి, మాడుగుల మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట జరిగిన ధర్నాల్లో పాల్గొన్నారు. విశాఖ సీతమ్మధార అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్ పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలిలో శ్రీకాకుళం జిల్లా ఇన్‌చార్జ్ ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు ఆధ్వర్యంలో రైతులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సాలూరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే పాముల. పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో ధూళికేశ్వర ఆలయం నుంచి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. విజయనగరం పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్సీ వీరభద్రస్వామి పాల్గొన్నారు.
ఎక్కడికక్కడ నిరసనలు..
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొని తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి నేతృత్వంలో ధర్నాను నిర్వహించారు.
వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఎమ్మెల్యే జయరాములు నేతృత్వంలో రెవిన్యూ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కడప తహాశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే అంజాద్‌బాష, మేయర్ సురేష్‌బాబు నడిరోడ్డుపై బైఠాయించారు. పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నేతృత్వంలో ధర్నా చేట్టారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో తహాశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా కల్లూరు తహశీల్దారు కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ధర్నాలో పాల్గొనగా, కోడుమూరులో ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
ధర్నాలతో దద్దరిల్లిన చిత్తూరు
చిత్తూరు జిల్లా వడమాల పేట తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా, తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట పార్టీ జిల్లా అధ్యక్షుడు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని ఐరాల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి నేతృత్వంలో ధర్నా జరిగింది.
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన నేతృత్వంలో పామర్రు తహశీల్దార్ కార్యాలయం, ఎమ్మెల్యే మేకా వెంకటప్రతాప అప్పారావు నేతృత్వంలో నూజివీడులోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, మార్కాపురం ధర్నాలో ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి పాల్గొన్నారు. దర్శిలో జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలుకలూరిపేటలో, నర్సారావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, వేమూరులో రాష్ట్ర ఎస్సీసెల్ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల్లో ధర్నాలు నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. బాపట్ల, పొన్నూరు నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.