నిత్యావసర ధరలపై భగ్గు భగ్గు | prices of essential | Sakshi
Sakshi News home page

నిత్యావసర ధరలపై భగ్గు భగ్గు

Published Tue, Nov 3 2015 1:32 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

నిత్యావసర ధరలపై  భగ్గు భగ్గు - Sakshi

నిత్యావసర ధరలపై భగ్గు భగ్గు

ధరలు నియంత్రించాలని జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ధర్నా
నియోకవర్గ కేంద్రాల్లో తహశీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన

 
నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ
అదుపు లేకుండా పెరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం తీరుపై వైఎస్సార్ సీపీ భగ్గుమంది. ధరలను వెంటనే నియంత్రించాలని కోరుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు జిల్లావ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ఎదుట సోమవారం పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు.
 
విజయవాడ/మచిలీపట్నం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒంటెత్తు పోకడలతో నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాల పక్షాన నిలిచి ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ధరలను తక్షణం అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు చేశాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుతో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ధర్నాలు నిర్వహించి తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు.  

► విజయవాడ అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శన, ధర్నా చేశాయి. ఈ ఆందోళనలో పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

►పెనమలూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో పార్టీ దక్షిణ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం పాలన సాగిస్తోందని, సామాన్యులు బతకడం కష్టతరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ధరలను నియంత్రించకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమించి ప్రభుత్వానికి బుద్ధిచెబుతామని హెచ్చరించారు.

►పామర్రులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన కూడలి వరకు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో ధర్నా చేసేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మూల్పూరి హరీష, తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, ఆయా మండలాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

►నందిగామలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్  మొండితోక అరుణకుమార్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు దండలుగా చేసి వాటిని ధరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

►నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు ఆధ్వర్యంలో జంక్షన్ రోడ్డులో రాస్తారోకో, నూజివీడు సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. మున్సిపల్ చైర్మన్ బసవా రేవతి, నూజివీడు జెడ్పీటీసీ సభ్యుడు బాణావతు రాజు, ఆగిరిపల్లి జెడ్పీటీసీ సభ్యుడు కాజ రాంబాబు, మండల, పట్టణస్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

►జగ్గయ్యపేటలో నియోజకవర్గ సమన్వయకర్త సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. తొలుత పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లారు. మునిసిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావుతో పాటు పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

►కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా రెండు గంటల పాటు ధర్నా చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు నిమ్మగడ్డ భిక్షాలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

►పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. వైఎస్సార్ సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు ఆనంద్, బీసీ విభాగం నాయకులు తిరుమాని శ్రీనివాస్, నాలుగు మండలాల్లోని పార్టీ కన్వీనర్లు, ప్రజలు పాల్గొన్నారు. డెప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

► మైలవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జి.కొండూరు ఎంపీపీ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

►గన్నవరం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో గన్నవరం తహశీల్దార్ కార్యాలయం వద్ద పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు.

► అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆరు మండలాల పార్టీ కన్వీనర్లు, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

►మచిలీపట్నం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. నేతలు షేక్‌సలార్‌దాదా, మాదివాడ రాము, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డెప్యూటీ తహశీల్దార్‌కు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement