దిగని ధరలు
దాడులతో సరి!
నియంత్రణపై చర్యలు శూన్యం
సామాన్యుల వెతలు పట్టని సర్కారు
శమరశంఖం పూరించిన వైఎస్సార్‌సీపీ
నేడు తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు
విశాఖపట్నం: పొద్దున్నే ఇడ్లీముక్కేకాదు..పప్పన్నం..గంజి మెతుకులు కూడా భారమైపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో ధరలు చుక్కలను దాటేశాయి. అందుబాటులో లేని ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నాడు. అదుపు చేయాల్సిన సర్కార్ మొద్దునిద్ర వీడటంలేదు. పట్టించు కోవాల్సినఅధికారులు పత్తాలేకుండా పోయారు. దీంతో సర్కార్ తీరును ఎండగడుతూ వైఎస్సార్‌సీపీ ఆందోళన బాటపట్టింది. సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలకు ఆ పార్టీ సర్వసన్నద్ధమైంది.
ధరల నియంత్రణలో సర్కార్ పూర్తిగా విఫలమైందని సామాన్యులే కాదు.. అన్ని వర్గాల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. అధికారుల మెరుపు దాడులు ముచ్చటగా మూడురోజులకే పరిమితం చేశారు. ఈ మూడురోజుల దాడుల్లోనే ఏకంగా మూడు కోట్లకు పైగా విలువైన పప్పులు, ఆయిల్స్ బయటపడ్డాయంటే బ్లాక్ మార్కెట్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లూను కుందో అర్థమవుతుంది. బ్లాక్ మార్కెటర్స్‌కు అధికార వర్గాలు ఏస్థాయిలో కొమ్ముకాస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది.
చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో బియ్యం కిలో రూ.55, కందిపప్పు రూ.200, మినపప్పు రూ.185, సన్‌ప్లవర్ ఆయిల్ రూ.100లు, వేరుశనగ నూనె రూ.130 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ నిత్యావసర ధర మూడింతలు పెరిగింది. దీంతో సామాన్యుడు మూడు పూట్లా తినే పరిస్థితి లేకుండా పోయింది. ధరల నియంత్రణపై రాష్ర్ట , జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయాల్సిన ధరల స్థిరీకరణ జాడే లేదు. అన్ని హోల్‌సేల్, రిటైల్ దుకాణాల్లో 30వ తేదీ నుంచి కందిపప్పు కిలో రూ.143లకే విక్రయించాలని, అలాగే మిగిలిన పప్పులను కూడా తక్కువ ధరలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని రాష్ర్ట మంత్రి పరిటాల సునీత ఆదేశాలు జిల్లాలో అమలుకు నోచుకోవడంలేదు.
సామాన్యులేమైపోతే మాకేంటి.. మా జేబులు నిండితే అదే పది వేలు అన్నట్టుగా అధికార పార్టీ పెద్దలతో పాటు అధికారులు కూడా వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ సీపీ శమరశంఖం పూరించింది. పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పార్టీ యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు..రాస్తారోకోలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ పిలుపుతో సామాన్యులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా తలపెట్టిన ఈ ఆందోళనల్లో పార్టీ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ధరల నియంత్రణపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాధ్ పిలుపు నిచ్చారు.