భగ్గు.. భగ్గు
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు
జిల్లా వ్యాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు
భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, సామాన్యులు, గృహిణులు, అభిమానులు
ధరల పెరుగుదలను నియంత్రించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిక
పట్నంబజారు(గుంటూరు): పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ గర్జించింది. తక్షణం ప్రభుత్వం దిగివచ్చి ధరలను నియంత్రించాలని ఎలుగెత్తింది.నియోజకవర్గ కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట కదం తొక్కింది. ప్రభుత్వం దిగివచ్చేలా పోరాటానికి నడుంకట్టింది. సామాన్యుల బాధలు తీరేవరకు పోరాటం చేస్తానని ప్రతిన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంతో విఫలమైన ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా పోరుబాట పట్టారు. నియోజకవర్గ కేంద్రాల్లోని తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపట్టారు. ధరలపై మొద్దు నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మేల్కోపేలా ఆందోళనలకు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీగా ధర్నా జరిగింది. ప్రభుత్వం మేల్కోనకపోతే పోరాటం మరింత ముందుకు తీసుకు వెళ్తామని నేతలు హెచ్చరించారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నేతృత్వంలో సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున చేపట్టిన ధర్నా విజయవంతమైంది. వేలాదిగా కార్యకర్తలు, సామాన్యులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ పోరాటానికి మద్దతుగా నిలబడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
ఆకట్టుకున్న ఉల్లి..మినపప్పులతో నిరసన ప్రదర్శన ...
బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో కంది, పెసర, మినప్పప్పు, ఉల్లిపాయలు ప్రదర్శన నిర్వహిస్తూ, ధర్నా నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో గ్రంథాలయం సెంటర్ వద్ద రాస్తారోకోకు దిగారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా, పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ధర్నాను భగ్నం చేసేందుకు ప్రయత్నించడంతో ఎమ్మెల్యే, కార్యకర్తలు వారితో వాగిద్వాదానికి దిగారు. అంతకుముందు పార్టీ కార్యాలయం నుంచి భారీగా ప్రదర్శన నిర్వహించారు. గుంటూరులో నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్‌ముస్తఫాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహిస్తూ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించారు. పొన్నూరులో పార్టీ కేంద్ర కార్యనిర్వాహకమండలి సభ్యులు రావి వెంకటరమణ ఆధ్వర్యంలో ధర్నా జరగగా, ఎమ్మెల్సీ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వినుకొండలో నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు, కంది సంజీవరెడ్డి, బండారు సాయిబాబు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. గురజాలలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ధర్నా చే శారు. వేమూరు నియోజకవర్గంలో ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తెనాలి నియోజకవర్గంలో సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ధర్నా నిర్వహించ టంతో పాటు, పప్పులతో ప్రదర్శన నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో సమన్వయకర్త కత్తెర హెనీక్రిస్టీనా ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రేపల్లె నియోజవర్గంలోని నగరం మండలంలో పార్టీ నేతల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన కార్యక్రమాల అనంతరం అధికారులకు పార్టీ నేతలు వినతి పత్రాలను అందజేశారు.