
ప్రైవేట్ సైన్యాన్ని పెంచి పోషించలేదు
∙ నాకు రక్తపు మరకలు అంటించొద్దు
∙ అరాచకాలు, సెటిల్‌మెంట్లకు వ్యతిరేకం
∙ పరోక్షంగా ‘పరిటాల’ వర్గాన్ని టార్గెట్ చేసిన చౌదరి
అనంతపురం టౌన్ : అరాచకాలు, సెటిల్‌మెంట్లకు తాను వ్యతిరేకమని, అనవసరంగా రక్తపు మరకలు అంటించవద్దని అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. రుద్రంపేట సమీపంలో రెండ్రోజుల క్రితం జరిగిన జంట హత్యలో తన ప్రమేయం ఉందని కొందరు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రైవేట్ సైనాన్ని పెంచి పోషించే సంస్కృతి తనది కాదన్నారు. ‘అవే’ సంస్థ స్థాపించి ఫ్యాక్షన్‌కు వ్యతిరేకంగా సీమలో పోరాటం చేశానన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. అజయ్‌ఘోష్ కాలనీలో కొంత మంది నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడి అందులో వచ్చిన గొడవల వల్లే ఈ హత్యలు జరిగాయన్నారు. హతులు గతంలో కొన్ని మర్డర్ కేసుల్లో ఉన్నారని, ఆ హత్యలు ఎవరి కోసం చేశారో.. ఎవరికి తగాదాలు ఉన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే అంతా అర్థమవుతుందన్నారు. హత్య జరిగిన రోజు కొందరు స్లిప్పులు రాయించి తనపై ఆరోపణలు వచ్చేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిలుక పలుకులు పలికించారని ఆరోపించారు.
పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేయాలని, అందులో తనకు సంబంధం ఉన్న వాళ్లు ఉంటే కఠినంగా శిక్షించాలని సూచించారు. ఇదిలావుండగా ఎమ్మెల్యే ప్రెస్‌మీట్ అంతా పరోక్షంగా మంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేస్తూ ఉండడం పట్ల విలేకరులు తీవ్ర స్థాయిలో చర్చించుకున్నారు. ‘చిలుక పలుకుల’పై మీడియా ప్రశ్నలు వేయగా అది అందరికీ తెలిసిందేనని, సమయం వచ్చినప్పుడు రివీల్ అవుతానని చెప్పడం గమనార్హం. నిందితులు దొరికాక మరోసారి సవివరంగా ప్రెస్‌మీట్ పెడతానన్నారు.