కష్టాల్లో ఖరీఫ్
కరప మండలం విజయరాయుడుపాలెం, పెద్దాపురపాడు, గొడ్డటిపాలెం, జడ్‌భావారం, కరప, కాకినాడరూరల్‌లో గంగనాపల్లి, రేపూరు, కొవ్వూరు, తూరంగి, కొవ్వాడ గ్రామాలలోని పంటపొలాలకు సాగునీరు అందడంలేదు. వేలాది ఎకరాలు నీరు లేక కష్టాలుపడుతున్నారు. పంట పొలాల్లో ప
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
పట్టెడన్నం పెట్టే రైతన్న ఖరీఫ్ ప్రారంభంలోనే సాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాడు. పరిస్థితి ముందుగానే ఊహించిన రైతులు పంట విరామానికి సిద్ధమయ్యారు. పెట్టుబడులైనా మిగులుతాయని రైతులు భావించారు. తీరా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహా ఎమ్మెల్యేలు ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని, సాగుకు సెలవు ప్రకటించవద్దని పదేపదే ఊదరగొట్టారు. కానీ సాగుకు అవసరమైన నీటిని సరఫరా చేయలేక చేతులెత్తేసి చేష్టలుడిగి చూస్తున్నారు. పాలకుల మాటలు నమ్మి నట్టేట మునిగిపోయామని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో గత్యంతరంలేక సాగుచేసి ఇప్పుడు నీరు లేక నాట్లు ఎండిపోతుంటే రైతులు కంటతడిపెడుతున్నారు. తూర్పు, మధ్య డెల్టాలతో పాటు మెట్ట ప్రాంతంలో కూడా దాదాపు ఇవే పరిస్థితులు ‘సాక్షి’ పరిశీలనలో కనిపించాయి.
కోనసీమలో పంటలకు దూరం
నీరు లేక ఇప్పటికే కోనసీమ రైతులు సుమారు 40 వేల ఎకరాల్లో సాగుకు విరామం ప్రకటించారు. అమలాపురం నియోజకవర్గంలో 28 వేల ఎకరాలు వరి పంటసాగు చేయాల్సి ఉండగా, సాగునీరు అందని పరిస్థితుల్లో ముందుగానే రైతులు 10 వేల ఎకరాల్లో పంటవిరామం ప్రకటించారు. అల్లవరం మండలం తుమ్మలపల్లి, తూర్పులంకల్లో సుమారు 1000 ఎకరాల్లో పంటవిరామం ప్రకటించారు. సాగు చేపట్టిన 20 వేల ఎకరాల్లో శివారు ప్రాంతాలకు నీరు అందక సుమారు మూడువేల ఎకరాల్లో పంట చేలు నెర్రలు తీశాయి. ఉప్పలగుప్తం మండలం ఆదిలక్ష్మిపురం, అమ్మన్న అగ్రహారం, మునిపల్లి, వానపల్లి శివారు భూములు సాగునీరు లేక ఎండిపోయి రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. బొబ్బర్లంక –పల్లంకుర్రు ప్రధాన పంట కాలువ ప్రవహించే ముమ్మిడివరం నియోజకవర్గంలోనే 10 వేల ఎకరాల్లో వరి పంట నీటి ఎద్దడితో తల్లడిల్లుతోంది. అదే నియోజకవర్గం తాళ్ళరేవు మండలం మల్లవరం, పత్తిగొంది, కాట్రేనికోన మండలం కందికుప్ప, పల్లంకుర్రు, ముమ్మిడివరం మండలం చెయ్యేరు, అనాతవరం గ్రామాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి వికటాట్టహాసం చేస్తోంది.
∙ పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండల రైతులు పూర్తిగా పంట విరామాన్ని ప్రకటించారు. రాజోలు నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి పరిస్థితిని ముందుగానే అంచనా వేసుకున్న రైతులు స్వచ్ఛందంగా సుమారు ఐదు వేల ఎకరాల్లో పంటవిరామం ప్రకటించక తప్పింది కాదు. అయినవిల్లి మండలం నేదునూరు జమిందార్‌పేటలో సుమారు వెయ్యి ఎకరాలు ఆయకట్టుకు సాగునీరందక పంట భూములు నెర్రలు బారాయి. అంబాజీపేట మండలం కె.పెదపూడి, గంగలకుర్రు ఆగ్రహం, గంగలకుర్రుల్లో సుమారు రెండు వేల ఎకరాలు సాగునీరు అందక ఎండిపోతున్నాయి.
మంత్రుల నియోజకవర్గాల్లో అదే దుస్థితి...
∙ పిఠాపురం నియోజకవర్గంలో ఐదువేలు, అనపర్తి నియోజకవర్గంలో 10 వేలు, జగ్గంపేట నియోజకవర్గంలో 15వేల ఎకరాల్లో పంటకు ప్రతి బంధకాలెన్నో. పుష్కర, ఏలేరు సాగునీరు అందకపోవడంతో పంట భూములకు పూర్తిస్థాయిలో నీరందడంలేదు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో శివారు ఆయకట్టుకు నీరందక సుమారు 7 వేల ఎకరాలు ఎండిపోతున్నాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో సుమారు 12 వేల ఎకరాలకు సాగునీరు అందక చేలు ఎండిపోయి నెర్రలు తీశాయి. కాకినాడరూరల్ నియోజకవర్గంలో 3,500 ఎకరాల్లో నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు.
∙ కరప మండలం విజయరాయుడుపాలెం, పెద్దాపురపాడు, గొడ్డటిపాలెం, జడ్‌భావారం, కరప, కాకినాడరూరల్‌లో గంగనాపల్లి, రేపూరు, కొవ్వూరు, తూరంగి, కొవ్వాడ గ్రామాలలోని పంటపొలాలకు సాగునీరు అందడంలేదు. వేలాది ఎకరాలు నీరు లేక కష్టాలుపడుతున్నారు. పంట పొలాల్లో పరిస్థితిని స్వయంగా చూసిన వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు రెండు రోజులుగా పంట పొలాలను పరిశీలించి ఇరిగేషన్ అధికారులకు అల్టిమేటమ్ ఇచ్చారు. ఆ నేపథ్యంలోనే అధికారులు వచ్చి పంట పొలాల పరిస్థితిని పరిశీలించి వెళ్లారు. జిల్లాలో వేలాది ఎకరాలు సాగునీరు లేక ఖరీఫ్ పంటపై ఆందోళన నెలకొంది.