నిమజ్జనోత్సవానికి ముందుచూపు ‘కరువు’ | problem to vinayaka nimajjanam | Sakshi
Sakshi News home page

నిమజ్జనోత్సవానికి ముందుచూపు ‘కరువు’

Published Thu, Sep 8 2016 7:50 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

మానకొండూర్‌ చెరువు

మానకొండూర్‌ చెరువు

  • వెలవెలబోతున్న మానకొండూర్‌ చెరువు
  • కాకతీయ కాలువ ద్వారా నింపేందుకు చర్యలు
  • పూర్తిస్థాయిలో నిండాలంటే 15రోజులు
  • గతేడాది అసంపూర్తిగా నిమజ్జనం
  • మానకొండూర్‌ : వినాయక నిమజ్జనోత్సవానికి అధికారుల్లో ముందుచూపు కరువైంది. వర్షాభావ పరిస్థితులతో మానకొండూర్‌ పెద్ద చెరువు వెలవెలబోతోంది. మూడేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాకేంద్రంతోపాటు చుట్టుపక్క గ్రామాల్లో నెలకొల్పిన వినాయక విగ్రహాలను ఈ చెరువులోనే నిమజ్జనం చేస్తుంటారు. చెరువులో నీటిమట్టం తక్కువగా ఉండడంతో నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఎల్‌ఎండీ నుంచి కాకతీయ కాలువ ద్వారా మానకొండూర్‌ చెరువును నింపుతామని అధికారులు హామీ ఇస్తున్నా.. ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. అధికారులు చెప్పినట్లు కాకతీయ కాలువ ద్వారా నీరు విడుదల చేసినా చెరువు పూర్తిస్థాయిలో నిండాలంటే సుమారు 15 రోజులు పడుతుంది. మరోవైపు నిమజ్జనోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంత తక్కువ సమయంలో చెరువు నిండాలంటే సాధ్యం కాదు. ఒకవేళ శుక్రవారం ఉదయం నుంచి నీరు వదిలినా.. నిమజ్జనం సమయానికి ఒకటి, రెండు ఫీట్ల మేర తప్ప ఎక్కువ పెరగదు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనప్పటినుంచే అధికారులు మానకొండూర్‌ చెరువును నింపే పనులు చేస్తే బావుండేదని మండపాల నిర్వాహకులు పేర్కొంటున్నారు. 
    డెడ్‌ స్టోరేజీలో నీరు
    మానకొండూర్‌ పెద్ద చెరువు విస్తీర్ణం 375 ఎకరాలు. 680 ఎకరాల ఆయకట్టు. 18 ఫీట్ల మేర నీరు నిల్వ చేయెుచ్చు. కానీ.. వర్షాలు లేకపోవడంతో ప్రస్తుతం రెండుఫీట్ల (డెడ్‌స్టోరేజీ) నీరుంది. ఈ చెరువును నింపేందుకు కాకతీయ కాలువ డీబీఎం 2, 2సీ, డీబీఎం 3 ద్వారా నీటిని వదిలేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ పనులు రెండురోజులుగా సాగుతూనే ఉన్నాయి. కాకతీయ కాలువలో ఇసుకబస్తాలను అడ్డుగా వేసి నీటిని మళ్లించే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యేదెన్నడూ.. విగ్రహాలను నిమజ్జనం చేసేదెలా..? అని నిర్వాహకులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు చెరువుకట్టపై ఐదు భారీ క్రేన్ల సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేయాలని కలెక్టర్‌ ఆదేశాలు కూడా జారీ చేశారు. 
     భారీ విగ్రహాలకు ఇబ్బందే..
    జిల్లాకేంద్రం నుంచి ఏటా వందలాది వినాయక విగ్రహాలను నిమజ్జనం కోసం ఇక్కడికే తీసుకొస్తుంటారు. భారీ విగ్రహాలైనా.. ఈ చెరువుకు రావాల్సిందే. యేటా ఏడువందలకు పైగా భారీ వినాయక విగ్రహాలు, వందల సంఖ్యలో చిన్న పాటి విగ్రహాలు నిమజ్జనం చేస్తుంటారు. నాలుగేళ్లుగా ఆశించినస్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువు వెలవెలబోతోంది. గతేడాది వినాయక నిమజ్జనానికి చెరువులో చుక్కనీరు లేకపోవడంతో అధికారులు ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా నింపే ప్రయత్నం చేశారు. నిమజ్జనం సమయానికి రెండు, మూడు ఫీట్ల మేర మాత్రమే నీరు చేరింది. ఫలితంగా కొన్ని విగ్రహాలను చెరువుకట్టపైనే వేయాల్సి వచ్చింది. కొన్ని విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం కాకపోవడంతో  ఫైరింజన్‌ సహాయంతో విగ్రహాలపై నీళ్లు చల్లించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement