
మా దేవుడు మీరే సారూ...
ఐటీడీఏ పీఓ అంటే వారికి దేవుడితో సమానం. ఏ సమయంలో ఏ సమస్యతో వెళ్లినా...
ఏజెన్సీలో సమస్యలు కోకొల్లలు. ప్రభుత్వ పథకాలు ఇక్కడకు చేరడం చాలా కష్టతరం. గిరిజనుల అభ్యున్నతికి వస్తున్న నిధులు ఇక్కడికొచ్చేసరికే కరిగిపోతున్నారుు. జబ్బొస్తే ఆస్పత్రికి వెళ్లలేరు... నిత్యావసర సరకులు కొనుగోలుకు అష్టకష్టాలు పడతారు. మంచినీటికోసం కిలోమీటర్ల కొద్దీ నడుస్తారు. వీరి పంటకు గిట్టుబాటు లభించదు. వీరికి ప్రకృతి ప్రసాదించిన వరం సైతం పరులపాలవుతోంది. ఇదీ మన్యంవాసులు ఎదుర్కొనే ఇబ్బందులు. కొత్త పీవోగా లక్ష్మిషా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఆయన వల్లనైనా తమ కష్టాలు తీరుతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.
పార్వతీపురం: ఐటీడీఏ పీఓ అంటే వారికి దేవుడితో సమానం. ఏ సమయంలో ఏ సమస్యతో వెళ్లినా... తమను ఆదుకుంటారనే నమ్మకంతో గిరిజనులుంటారు. అలాంటి నమ్మకాన్ని గతంలో పీఓలుగా పనిచేసిన ఎల్.వి.సుబ్రహ్మణ్యం, కరికల్ వలెవన్, ఆర్.పి.సిసోడియా... లాంటి అధికారులు పొందారు. ఆ తర్వాత వచ్చిన పీఓలు తమ ముద్రలు వేసుకున్నారే తప్ప గిరిజనుల హృదయాల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోలేకపోయారు. గత కొన్ని నెలలపాటు ఖాళీగా ఉన్న ఐటీడీఏ కార్యాలయానికి కొత్త పీఓగా డా.జి.లక్ష్మి షా రానున్నారు. ఈయనైనా తమ ఆశలు నెరవేర్చాలని కోరుకుంటున్నారు.
గాడి తప్పిన పాలన
ప్రస్తుతం ఐటీడీఏ పాలన గాడితప్పింది. ఉద్యోగుల్లో క్రమశిక్షణ లోపించింది. గత పీఓ ప్రసన్న వెంకటేష్, బయోమెట్రిక్, సీసీ కెమెరాలు తదితర వాటితో ప్రక్షాళన చేపట్టేందుకు చర్యలు చేపట్టినా అవి ఎక్కువ రోజులు నిలవలేదు. అవినీతి ఇక్కడ వేళ్లూనుకుంది. కొన్నేళ్లుగా ఉద్యానవన శాఖలో జరిగిన సంఘటనలే ఇందుకు ఉదాహరణ. ఒకప్పుడు ఐటీడీఏ రాజకీయాలకు దూరంగా ఉండేది. ఇప్పుడు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో నడుస్తోంది. నిర్వాసిత పనులు సైతం అధికార పార్టీ నాయకులకు అప్పగించడమే ఇందుకు నిదర్శనం. ఇక గిరిజనులకు మౌలిక సదుపాయాలైన వైద్యం, విద్య, రోడ్లు, తాగునీరు, సాగునీరు తదితరవన్నీ ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉన్నారుు.
గిరిజన ప్రాంతాలు చూడని అధికారులు
గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగం అందరికీ కష్టం. ఇక్కడ ఎవరిని నియమించినా... చుట్టం చూపుగానే వెళ్తారు తప్ప చిత్తశుద్ధితో సేవలందించిన దాఖలాల్లేవు. ఇక్కడకు వైద్యం అందనంత దూరం. అందుకే దాదాపు 10 మంది ఒక్క ఏడాదిలోనే మృత్యువాత పడ్డారు. సబ్-ప్లాన్‌లోని పీహెచ్‌సీ డాక్టర్లు ఇంటిదగ్గర బోరు కొడితేనే పీహెచ్‌సీలకు వెళ్తారనే నానుడి ఉంది. టీచర్లంటే...గిరిశిఖర గ్రామాలకు రోడ్లు లేకపోతే ఎలా వెళ్లగలం...అంటూ యూనియన్ల బలంతో రూల్స్ మాట్లాడుతూ నెలకోసారో.. రెండసార్లో... అలా బడి ముఖం చూస్తారు. ఆశ్రమ పాఠశాలల్లో మెనూ అమలు కాదు. నిర్వహణ దారుణంగా ఉంటోంది.
వాటిని పర్యవేక్షించాల్సిన ఏటీడబ్ల్యూఓలు పట్టించుకోవడంలేదు. ఇక ఇంజనీరింగ్ సెక్షన్‌లో అధికారులు ఎవరికీ చిక్కరు. దొరకరు. వ్యవసాయం, ఉద్యానవనం ఇలా ఏ విభాగమూ సక్రమంగా పనిచేయడంలేదు. వీటన్నింటినీ గాడిలోపెట్టాల్సిన బాధ్యత కొత్త పీవోపై ఉంది.
• ఐటీడీఏ కొత్త పీవోగా లక్ష్మిషా బాధ్యతల స్వీకరణ నేడు
• తమ కష్టాలు తీర్చాలని కొండంత ఆశతో గిరిజనులు
• పథకాలు సక్రమంగా అమలుకు చర్చలు తీసుకోవాలని వినతి