కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొందని, ఆయనకు ఏదైనా జరిగితే వంగవీటి మోహనరంగా హత్యానంతర పరిస్థితులు రాష్ర్టంలో తలెత్తుతాయని కాపునాడు జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
- అక్రమ కేసులు ఎత్తివేయాలి
- కాపునాడు జేఏసీ కన్వీనర్ కొప్పుల వెంకట్
విజయవాడ (గాంధీనగర్)
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన నెలకొందని, ఆయనకు ఏదైనా జరిగితే వంగవీటి మోహనరంగా హత్యానంతర పరిస్థితులు రాష్ర్టంలో తలెత్తుతాయని కాపునాడు జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో కాపునాడు జేఏసీ ప్రతినిధులు సోమవారం మీడియాతో మాట్లాడారు. జేఏసీ కన్వీనర్ కొప్పుల వెంకట్ మాట్లాడుతూ కాపు ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు వారిని అణిచివేయాలని ప్రయత్నించడం హేయమైన చర్య అన్నారు. కాపులపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
గోదావరి జిల్లాల కాపులు సౌమ్యులని చెప్పిన చంద్రబాబు కాపు యువకులపై అక్రమ కేసులు బనాయించి ఎందుకు అరెస్ట్‌లు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కాపులకు ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతున్నందువల్లే ముద్రగడ ఉద్యమం చేపట్టారన్నారు. ఆయన్ను తక్షణమే మీడియా ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తుని ఘటనకు బాధ్యులంటూ అరెస్ట్ చేసిన వారిలో మిగిలిన ముగ్గుర్ని తక్షణమే విడుదల చేయాలని కోరారు.
నిన్నటివరకు ముద్రగడపై కాపు మంత్రులను ఉసిగొల్పిన చంద్రబాబు తన సామాజికవర్గం మంత్రులతో మాట్లాడిస్తున్నారన్నారు. ఇది సరికాదన్నారు. కాపు నాయకులపై పెట్టిన కేసులు, నిర్బంధం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సాక్షి చానల్ ప్రసారాల నిలిపివేతను జేఏసీ ఖండించింది. ఈ సమావేశంలో సర్వకాపు సమ్మేళనం కన్వీనర్ మల్లెమూడి పిచ్చయ్యనాయుడు, జేఏసీ నాయకులు ఎన్.ఎస్.రాజు, వై.చలపతిరావు, బి.ప్రభాకర్, విక్రమ్‌నాగేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, నవనీతం సాంబశివరావు, గంగాధర్ పాల్గొన్నారు.