కామారెడ్డి : గతంలో కామారెడ్డి ప్రాంతాన్ని కోడూరు అని పిలిచేవారు. కాలక్రమంలో కామారెడ్డిగా మారింది. మూడు జిల్లాల కూడలి ప్రాంతం కావడంతో రోజురోజుకు అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరికీ ఆశ్రయమిచ్చింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందినవారే కాకుండా.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలూ స్థిరపడ్డారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కుటుంబాలు తమదైన ముద్రవేశాయి. ఆర్థికంగా ఎదిగాయి.
విద్యాసుగంధాలు..
కామారెడ్డి విద్యారంగంలో ఇప్పటికే అగ్రభాగాన ఉంది. 1964లో ప్రజల భాగస్వామ్యంతో కామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 264 ఎకరాల వైశాల్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. ఈ కళాశాల తరువాతి కాలంలో ప్రభుత్వపరమైంది. ఈ కళాశాలలో రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులున్నాయి. బీఎస్సీ ఫిషరీస్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీఏ రూరల్ ఇండస్ట్రీ వంటి కోర్సులతో కాలేజీ రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. ప్రత్యేక కోర్సులు చదివిన వేలాది మంది ఈ ప్రాంతవాసులు దేశ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. కాలేజీలో పీజీ కోర్సులు కూడా ఉన్నాయి. గతంలో ఇదే కళాశాలలో బీఎస్సీ డెయిరీ కోర్సుగా ఉండి, తరువాత బీటెక్ డెయిరీగా రూపాంతరం చెందింది. ఈ కోర్సు ఉన్న ఏకైక కళాశాల ఇదే.. ఇక్కడ డెయిరీ యూనివర్సిటీ నెలకొల్పేందుకు కావాల్సిన వనరులు కూడా ఉన్నాయి. డెయిరీ కాలేజీలో ఎంటెక్ డెయిరీ ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బీఈడీ, డీఈడీ, వృత్తి విద్యా కోర్సులను బోధించే ప్రైవేట్ కళాశాలలెన్నో ఉన్నాయి. కామారెడ్డికి పది కిలోమీటర్ల దూరాన తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ సౌత్ క్యాంపస్ ఉంది.
వ్యాపారంలో అగ్రగామి
కామారెడ్డి పట్టణం వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా మారింది. ముఖ్యంగా బెల్లం వ్యాపారానికి కామారెడ్డి గంజ్ పెట్టింది పేరు. ఇక్కడ ఏటా వేలాది టన్నుల బెల్లం వ్యాపారం సాగేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెల్లంపై విధించిన ఆంక్షలతో వ్యాపారం కొంత దెబ్బతిన్నప్పటికీ.. వ్యాపారం కొనసాగుతోంది. అలాగే మెడికల్ వ్యాపారంలో కామారెడ్డి తెలంగాణలోనే నంబర్‌వన్‌గా ఉంది. 80కి పైగా హోల్‌సెల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయిక్కడ. ఇక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లోని 20కి పైగా జిల్లాలు, పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా మందులు సరఫరా అవుతున్నాయి. వస్త్ర వ్యాపారంలో కూడా కామారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లోలాగే భారీ షాపింగ్‌మాల్స్ ఉన్నాయి. జిల్లావాసులే కాకుండా కామారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందినవారూ ఇక్కడికి వచ్చి దుస్తులు కొనుగోలు చేస్తుంటారు.
గతంలో రైస్‌మిల్ దందాలో కూడా కామారెడ్డి అగ్రభాగాన ఉండేది. రైస్‌మిల్లర్లు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు. వ్యవసాయం తరువాత ఎక్కువ కుటుంబాలు ఆధారపడి జీవించే బీడీ పరిశ్రమకు కామారెడ్డి గుండెకాయలా ఉంది. ఇక్కడ ప్రముఖ బీడీ కంపెనీల ప్రధాన కార్యాలయాలున్నాయి. స్థానికంగానూ ప్రముఖ బీడీ కంపెనీలున్నాయి. నిత్యం కోట్ల బీడీల ఉత్పత్తి జరిగి కామారెడ్డి నుంచి ఐదారు జిల్లాలే కాక పొరుగున ఉన్న మహారాష్ట్రకు భారీ ఎత్తున బీడీలు సరఫరా అవుతున్నాయి. నూనె దందాలోనూ ఇక్కడి వ్యాపారులు ముందున్నారు. కామారెడ్డి నుంచి పదికిపైగా జిల్లాలకు పెద్ద ఎత్తున నూనె రవాణా అవుతోంది. బంగారం వ్యాపారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. 60కిపైగా ఉన్న బంగారం దుకాణాల్లో భారీ ఎత్తున బంగారం విక్రయాలు సాగుతుంటాయి.
ఆధ్యాత్మిక శోభ
పట్టణంలో పురాతన కిష్టమ్మ గుడి, వేణుగోపాలస్వామి దేవాలయం, విఠలేశ్వరాలయాలున్నాయి. అయ్యప్ప ఆలయం, గంజ్ ధర్మశాలలో హనుమాన్ ఆలయం, విద్యానగర్‌లో సాయిబాబా ఆలయం, సిరిసిల్ల రోడ్డులో కన్యకాపరమేశ్వరి ఆలయం, హౌసింగుబోర్డులో సంకష్టహర మహా గణపతి, శారదామాత ఆలయాలు.. ఇలా ఎన్నో ఆలయాలతో కామారెడ్డి ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. వినాయక చవితి ఉత్సవాలు హైదరాబాద్ స్థాయిలో ఇక్కడ ఘనంగా జరుగుతాయి. వినాయక విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర రెండు రోజుల పాటు సాగుతుంది. శ్రీరామ నవమి ఉత్సవాలు, దసరా వేడుకలు వైభవంగా సాగుతాయి. దసరా రోజున లేజర్ షో నిర్వహిస్తారు. ఉగాది పండుగ రోజున ఎడ్ల బండ్లతో పట్టణంలో భారీ ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కామారెడ్డి ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం వల్ల పట్టణంలో అన్ని ప్రాంతాల్లో ప్రార్థన మందిరాలున్నాయి. క్రిస్టియన్ల సంఖ్య కూడా ఎక్కువే.. పట్టణంలో జైన దేవాలయం కూడా ఉంది.
సాహిత్య రంగంలో..
సాహిత్య కార్యక్రమాలకు కామారెడ్డి కేంద్రబిందువుగా ఉంటోంది. ఇక్కడి కవులు, రచయితలు, కళాకారులు రాష్ట్రంలోనే పేరుపొందారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి నిన్నటి తెలంగాణ ఉద్యమం దాకా.. కామారెడ్డి ప్రాంతం పోరాటాల్లోనూ ముందువరుసలో నిలిచింది. కామారెడ్డిలో దాదాపు వంద మంది కవులు, రచయితలు ఉన్నారు. ఆదర్శ కళా సమితి, హితసాహితి, జాతీయ సాహిత్య పరిషత్, సాహితీ మిత్ర, స్ఫూర్తి సాహితి, అభిలేఖిని రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘం.. ఇలాæ ఎన్నో సాహితీ సంస్థలు కొనసాగుతున్నాయి.
జాతీయ నేతల స్ఫూర్తి...
ఇక్కడ జాతీయ భావం ఎక్కువగా కనిపిస్తుంది. జాతీయ నాయకుల పేరిట కాలనీలు, రోడ్లు ఉన్నాయి. అలాగే పలు కూడళ్లలో జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. రైల్వేస్టేషన్ కూడలి వద్ద ఇందిరాగాంధీ విగ్రహం, వ్యాపార వాణిజ్య సంస్థలు ఉన్న రోడ్లలో సుభాష్‌చంద్రబోస్, జయప్రకాశ్ నారాయణ్, గంజ్‌రోడ్ కూడలి వద్ద పొట్టి శ్రీరాములు, రైల్వే కమాన్ దగ్గర అంబేద్కర్, కమాన్‌కు ఇటువైపున ఆచార్య జయశంకర్, నిజాంసాగర్ కూడలి వద్ద ఒక వైపున రాజీవ్‌గాంధీ, మరోవైపు తెలంగాణ తల్లి, తెలంగాణ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య, మున్సిపాలిటీ వద్ద మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయిపూలే దంపతుల విగ్రహాలు, ఎన్టీఆర్, వివేకానంద, ఫణిహారం రంగాచారి, జన్మభూమి రోడ్ చౌరస్తా వద్ద సర్దార్ వల్లాభాయ్ పటేల్ విగ్రహాలున్నాయి. గంజ్‌కు గాంధీ గంజ్ అన్న పేరుంది. ఇక్కడ గాంధీ విగ్రహం కనిపిస్తుంది. అడ్లూర్ రోడ్డులో ఆచార్య జయశంకర్ కాలనీ అవతరించింది. అక్కడ జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.