ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తున్న నాయకులు
– సర్కారు తీరుపై సీపీఎం నేతల విమర్శ
– ఎత్తిపోతల పథకాల పరిశీలన
నందికొట్కూరు: ఎత్తిపోతల పథకాలు పూర్తిచేసి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందిస్తామని సర్కారు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణపై శ్రద్ధ పెట్టడం లేదని సీపీఎం రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబులేసు, రాష్ట్ర కమిటీ సభ్యులు టీ. షడ్రక్ ఆరోపించారు. ముచ్చుమర్రి, హంద్రీనీవా ఎత్తిపోతల పథకాలను సీపీఎం బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఎత్తిపోతల పథకాలకు రూ. వంద కోట్లు కేటాయించామని ప్రకటించడమే కానీ నిర్దేశించిన లక్ష్యం ప్రభుత్వం చేరుకోవడం లేదని ధ్వజమెత్తారు. హంద్రీనీవా రెండవ దశ పనులు ఎందుకు ప్రారంభించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముచ్చుమర్పి ఎత్తిపోతలకు సంబంధించి 25 శాతం పనులు కూడా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనులు వేగవంతంగా పూర్తిచేసి ఆయకట్టుకు సాగునీరు అందించకుంటే ఉద్యమాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రాజశేఖర్, డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వర్లు, నాయకులు రామకష్ణ, నాగేశ్వరరావు, రాజు, శాలు తదితరులు పాల్గొన్నారు.