లాల్–నీల్ జెండాలు ఏకం చేస్తాం: సీపీఎం
సాక్షి, హైదరాబాద్: కమ్యూనిస్టు, సామాజిక న్యాయ (లాల్–నీల్) జెండాలు ఏకమయ్యేలా ఆదివారం హైదరాబాద్‌లో సమరసమ్మేళన బహిరంగసభ జరగబోతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మహాజన పాదయాత్ర కోఆర్డినేటర్ బి. వెంకట్ వెల్లడించారు. శుక్రవారం ఎంబీభవన్‌లో పార్టీ నేతలు జి.నాగయ్య, టి.జ్యోతిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఎం పాదయాత్ర నేపథ్యంలో సామాజిక తరగతులను విస్మరిస్తే భవిష్యత్ ఉండదని ప్రభుత్వం గుర్తించిం దన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు చట్టబద్ధతను సాధించడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యమన్నారు. బీసీలు, ఎంబీసీలకు ప్రకటించిన పథకాలకు బడ్జెట్ కేటాయింపులు, జీవోలు కాకుండా అసెంబ్లీలో చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేశారు.
నేడు హైదరాబాద్‌కు కేరళ సీఎం విజయన్
సీపీఎం బహిరంగసభలో పాల్గొనేందుకు శనివారం రాత్రి కేరళ సీఎం పినరయి విజయన్ హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆదివారం సాయంత్రం 4.30కు బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపంలో కేరళ సాంస్కృతిక సంస్థలు, సంఘాలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు సరూర్‌నగర్ ఔట్‌డోర్ స్టేడియంలో సీపీఎం బహిరంగసభలో ముఖ్యఅతిథిగా ప్రసంగిస్తారు.