ఆశాజనకం | Promising | Sakshi
Sakshi News home page

ఆశాజనకం

Published Tue, Oct 18 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

ఆశాజనకం

ఆశాజనకం

• లక్ష్యం దిశగా ఎస్సారెస్పీ జల విద్యుత్‌ ఉత్పత్తి
• ఈసారి లక్ష్యం సుమారు 68 మిలియన్‌ యూనిట్లు..
• ఇప్పటికే 28.51 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి
• నిండుకుండలా ఎస్సారెస్పీ జలాశయం
• గతేడాది నీళ్లు లేక ఒక్క యూనిట్‌ ఉత్పత్తి కాలేదు..
సాక్షి, నిజామాబాద్‌ :
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో జల విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి పూర్తి స్థాయిలో భరోసా ఏర్పడింది. గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులో నీళ్లు లేక ఒక్క యూనిట్‌ కూడా విద్యుత్‌ ఉత్పత్తి జరగలేదు. ఈసారి పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం 2016–17లో ఈ కేంద్రం ద్వారా సుమారు 68 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని జెన్‌కో లక్ష్యంగా నిర్ణయించింది. నిర్దేశిత లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే 28.512 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. 2017 మార్చి మాసాంతానికి నిర్దేశిత లక్ష్యానికంటే ఎక్కువే విద్యుత్‌ ఉత్పత్తి అయ్యే అవకాశాలున్నాయని జెన్‌కో ఉన్నతాధికారులు భావిస్తున్నారు. పక్షం రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా, సుమారు 90 టీఎంసీలతో జలాశయం నిండుకుండలా తయారైంది. దీంతో కాకతీయ కాలువకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నారు. ఈ కాలువకు నీటి విడుదల చేసినప్పుడు మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. సుమారు 8,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నీటిని విడుదల చేస్తున్న వారంలో నాలుగు యూనిట్లు ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. కనీసం వెయ్యి క్యూసెక్కుల నీటి విడుదల జరిగినా విద్యుత్‌ ఉత్పత్తికి వీలు కలుగుతుంది. కాగా ఈ ఖరీఫ్‌ సీజనుతోపాటు, రబీ సీజనులో కూడా ఈ కాలువకు నీటిని విడుదల చేసే అవకాశాలుండటంతో.. 2017 ఫిబ్రవరి తర్వాత కూడా విద్యుత్‌ ఉత్పత్తికి వీలుపడుతుందని జెన్‌కో వర్గాలు భావిస్తున్నాయి.
విద్యుత్‌ ఉత్పత్తి తీరిది..
ఈ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని పరిశీలిస్తే.. 2013–14 ఆర్థిక సంవత్సరంలో సుమారు 85 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. ఆ తర్వాత తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రాజెక్టులో నీళ్లు లేక ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో కేవలం 12 మిలియన్‌ యూనిట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2015–16లో అయితే ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి జరగలేదు. ఈసారి మాత్రం ప్రాజెక్టులో భారీగా నీరు చేరడంతో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమిస్తామని జెన్‌కో అధికారులు పేర్కొంటున్నారు. సింగూరు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలోనూ ప్రస్తుతం విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. రోజుకు సుమారు 0.254 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్‌కో పర్యవేక్షక ఇంజనీర్‌ రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement