భక్తుల మనోభావాలు కాపాడుతాం
- ·పూజలు, ప్రసాదం, తాగునీటికి అనుమతి
- కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
బండి ఆత్మకూరు: భక్తుల మనోభావాలు కాపాడతామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. ఓంకార క్షేత్రం సమీపంలోని నల్లమల కొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరస్వామి, అమ్మవారి ఆలయం వద్ద కాశిరెడ్డినాయన ఆశ్రమ నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం భోజనాలను అందించేవారు. ఇటీవల అటవీ అధికారులు కొండపైకి వాహనాలు వెళ్లకుండా, భోజనాలు ఏర్పాటు చేయకుండా అడ్డుకోవడంతో భక్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ బుధవారం డీఎఫ్‌ఓ శివప్రసాద్‌తో కలిసి కాలినడకన కొండపైకి వెళ్లారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ ప్రాంతం టైగర్ జోన్ పరిధిలోకి వస్తుందని, ఇది నిషిద్ధప్రాంతమని ఇక్కడకు ఎవరు రావడానికి వీలు లేదని డీఎఫ్‌ఓ శివప్రసాద్ కలెక్టర్‌కు వివరించారు. కాగా ఐదారేళ్లుగా కొండపైకి వచ్చే భక్తులకు అన్న దానం చేస్తున్నామని, అటవీశాఖ అధికారులు ఉన్నఫలంగా నిషేధం విధిస్తే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆశ్రమ నిర్వాహకుడు పెప్సీ నాగేశ్వరరెడి చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండుమూడు రోజుల్లో అటవీశాఖ ఉన్నతాధికారులతో చర్చించి వాహనాల ద్వారా అన్నదానం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక భక్తులు నిర్వహించుకునే పూజలు, తాగునీటి సరఫరా ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు.
దేవాదాయశాఖ ఆధీనంలోకి ఆలయాల నిర్వహణ
నల్లమల కొండపై నిర్మించిన వెంకటేశ్వరస్వామి, అమ్మవారి ఆలయాల నిర్వహణ దేవాదాయశాఖ ఆధీనంలోకి వచ్చే విధంగా దేవాదాయశాఖ అధికారులతో చర్చిస్తామని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. ఈ ఆలయాల నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల కంటే దేవాదాయశాఖ ఆధీనంలో ఉండడం మంచిదన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలోని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి ఉన్నారు.