పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
– విద్యార్థులు మొక్కల పెంపకాన్ని బాధ్యతగా స్వీకరించాలి
– పర్యావరణ ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్
– విద్యార్థులకు బహుమతుల ప్రదానం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పిలుపునిచ్చారు.దీన్ని ప్రతి ఒక్కరూ బా«ధ్యతగా తీసుకోవాలని సూచించారు. వాతావరణంలోని గాలి, నీరు, భూమిలలో సమతుల్యత లోపించడంతో విషవాయువులు వెలువడుతున్నాయన్నారు. జీవకోటికి ప్రాణధారమైన భూగర్భజలాల్లో నీరు అడుగంటి పోవడంతో ముప్పు పొంచి ఉందన్నారు. పరిశ్రమలు, సంస్థలు తమకు తాముగా పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ నుంచి జిల్లా పరిషత్ వరకు నిర్వహించిన పర్యావరణ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపీ ప్రారంభించారు. విద్యార్థులతో కలసి ర్యాలీలో పాల్గొని ఉత్సహ పరిచారు. విద్యార్థులు మొక్కల పెంపకాన్ని బాధ్యతయుతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి స్కూలు లేదా కళాశాలల్లో విద్యార్థుల పేరిట చెట్లు ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని కలెక్టర్ వెల్లడించారు.
విద్యార్థులకు బహుమతుల ప్రదానం...
పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కోసం జెడ్పీ కాన్ఫరెన్స్‌హాలులో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి ప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జేసీ–2 రామస్వామితోపాటు పలువురు ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్లు హాజరై ప్రసంగించారు. పర్యావరణానికి హాని కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జేసీ–రామస్వామి హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలకు అవగాహన కోసం నిత్యం ర్యాలీలు, అవగాహన సదస్సులు, జీపు జాతాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం పర్యావరణ విద్యపై నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరు కేఎస్‌ఏ కృష్ణ, రీజినల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరు ప్రసాదరావు, అధికారులు మునిప్రసాద్, శంకరరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.