ప్రకృతిలోని మనిషి.. పొత్తిళ్లలోని బిడ్డలా పెరగాలి తప్ప ‘కృత్రిమ’ వర్ణాల కాలుష్యపు ఉయ్యాలలో ఊపిరి పీల్చుకుంటూ ఎదగకూడదు. బిడ్డ దరిదాపుల్లో సింథటిక్ క్లాత్ లేకుండా,సహజమైన దారపు పోగుల వస్త్రాలను వెయ్యడమూ పర్యావరణ పరిరక్షణే! అప్పుడిక బిడ్డకే కాదు.. భూగోళానికీ మన ఇల్లు ‘పొత్తిల్లు’ అవుతుంది. స్వచ్ఛమైన జోలపాట అవుతుంది.
పాపాయికి పాలు పట్టి, ఉయ్యాలలో పడుకోబెట్టింది మృదుల. అప్పటి వరకు తల్లిని చూస్తూ తల్లిముఖాన్ని తాకడానికి గాల్లో చేతులూపుతూ బోసినవ్వులు చిందిస్తోంది. ఉయ్యాలలో పడుకోబెట్టి తను వెనుదిరిగిన మరుక్షణం నుంచే పాపాయి ముఖం మారిపోయింది. దిగులుగా, చికాగ్గా ముఖం పెట్టి గట్టిగా ఏడుపందుకుంది. ఎక్కువ సేపు ఏడిస్తే ఆస్త్మా ఎక్కువవుతుందేమోనని ఆదుర్దాగా వచ్చి బిడ్డను ఎత్తుకుంది మృదుల. అప్పటికే పాపాయి ముఖం ఎర్రగా కందిపోయింది. తల్లికి హత్తుకుని పోయి రెండు మూడు నిమిషాలకు ఏడుపు ఆపేసి మామూలయింది.‘‘ఉయ్యాలలో పడుకోబెడితే ఏడుస్తోంది.
ఇప్పుడిప్పుడే బోర్లా పడుతోంది. మంచం మీద పడుకోబెట్టి నేను కిచెన్‌లోకి వెళ్తే కిందపడుతుందేమోనని భయమేస్తోంది’’ అన్నది మృదుల అత్తగారి వైపు చూస్తూ నిస్సహాయంగా. ‘‘పిల్లలు తల్లి ముఖం గుర్తుపట్టడం మొదలైతే అంతేలే... తల్లి కనిపించకపోతే ఏడుస్తారు’’.అని తేలిగ్గా అనేసింది మృదుల అత్తగారు. ‘‘ఉయ్యాల నచ్చడం లేదేమో’’ నసిగింది మృదుల. అదేమాట గట్టిగా అంటే ఆమెకు కోపం వస్తుందేమోనని. ‘‘పిల్లలు ఉయ్యాల్లో వేస్తే కంటినిండా నిద్రపోతారు. పొద్దున స్నానం చేయించి పాలు పట్టి ఉయ్యాల్లో వేస్తే మధ్యాహ్నం వరకు కదిలేవాళ్లు కాదు. ఈ పాప ఉయ్యాలంటేనే గిట్టనట్లు మరీ ఎక్కువ ఏడుస్తోంది.
చిన్నగా అలవాటవుతుందిలే. మీ పుట్టింట్లో ఉయ్యాలే అలవాటు చేయకపోతిరి’’ అన్నదామె కొంచెం విసుగ్గా.మృదులకు తెలియనిది, అత్తగారికి అర్థం కానిది, పాపాయి చెప్పలేనిది ఒక్కటే.చీర ఉయ్యాలలో పాపాయికి ఊపిరాడడం లేదేమోనని మృదులకు చిన్న సందేహం వచ్చింది. ‘‘చంటిపిల్లలు ఉయ్యాల తొట్టికంటే చీర ఉయ్యాలనే ఇష్టపడతారు’’ అంటూ మృదుల సందేహాన్ని కొట్టి పారేసింది అత్తగారు.ఆమెతో వాదించడం ఎందుకులే అనుకుంటూ మృదుల పాపాయి ఒంటిని తడిమి చూసి మళ్లీ పడుకోబెట్టింది. పాపాయి ఒంటికి తరచూ ర్యాష్ వస్తోంది. డాక్టర్ ఇచ్చిన క్రీమ్‌లు రాసినప్పుడు తగ్గుతున్నాయి. మరో రెండురోజులకే మరోచోట పుట్టుకొస్తున్నాయి. పాపాయి పుట్టినప్పుడు ఏ కంప్లయింటూ లేకుండా హెల్దీగానే ఉంది. నెలలు నిండేకొద్దీ ఒక్కో సమస్య బయటపడుతోంది.
ప్రకృతికి దూరమయ్యాం
చంటిపిల్లలు చీర ఉయ్యాలను ఇష్టపడే మాట నిజమే. అయితే ఆ చీర ఉయ్యాల వేయాల్సింది కాటన్‌చీరతో మాత్రమే. సింథటిక్ క్లాత్ నుంచి గాలి ప్రసరించదు. సింథటిక్ క్లాత్‌తో ఉయ్యాల కట్టి పాపాయిని పడుకోబెడితే ఊపిరాడక ఏడుస్తారు. ఉయ్యాలకే కాదు, పాపాయి పక్కదుస్తులు కూడా మెత్తటి కాటన్‌వే వాడాలి. నేచురల్ కలర్స్ అద్దినవైతేనే ఆరోగ్యం. రసాయనిక రంగుల గాఢత వల్ల పసిఒళ్లు దద్దుర్లు తేలుతుంది. ఆర్గానిక్ కలర్స్ (సహజమైనవి)తో తయారైన పక్క దుస్తులకు వాడడం సాధ్యం కాకపోతే కనీసం తెల్లటి పక్కదుస్తులను వాడడం మంచిది.
కృత్రిమత్వం కలిగించే హాని చంటిబిడ్డల మీద వెంటనే ప్రతిఫలిస్తుంది. చంటిపిల్లలలో ఎక్కువమంది ఆస్త్మా బారిన పడడానికి కూడా కెమికల్ కలర్సే ప్రధాన కారణం. పెద్దవాళ్లలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కృత్రిమత్వపు ప్రతికూలతలు కొన్ని దశాబ్దాల తర్వాత గానీ బయటపడవు. మనిషి ప్రకృతికి దూరంగా పరుగులు తీస్తున్న ఫలితమే ఇదంతా అంటారు ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త పురుషోత్తమరెడ్డి. ‘‘సింథటిక్ ఫ్యాబ్రిక్, సింథటిక్ కలర్స్... మన ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి కూడా హాని చేస్తాయి.
ఫ్యాబ్రిక్‌కు సింథటిక్ డై వేసేటప్పుడు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ యథేచ్ఛగా జరిగిపోతాయి. ఆ ఫ్యాక్టరీల్లో పనిచేసే వారిని కూడా ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అరవై ఏళ్ల క్రితం మనదేశంలో సింథటిక్ కలర్స్ ఊసే లేదు, దుస్తులన్నీ నాచురల్ ఫైబర్‌తో నేచురల్ కలర్స్‌తో తయారైనవే ఉండేవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వేగంగా జరిగిన పారిశ్రామికీకరణలో ఆర్గానిక్ ఉత్పత్తులకు బదులు రసాయన రంగులు, రసాయన ఉత్పత్తుల వాడకం పెరిగింది’’ అన్నారాయన.
సహజమే సురక్షితం
సహజమైన రంగులపై మన దేశంలో చైతన్యం తక్కువే. చేనేతను పరిరక్షించే ప్రయత్నం మాత్రం కొంత వరకు జరుగుతోంది. అంతే తప్ప సింథటిక్ వాడకాన్ని తగ్గించడం లేదు. యూరోపియన్లు మాన్‌మేడ్ ఫైబర్‌ను, మాన్‌మేడ్ కలర్స్‌ను స్వచ్ఛందంగా నిషేధిస్తున్నారు. సింథటిక్ రంగుల దుస్తులు వాడితే స్కిన్ కేన్సర్ వచ్చే అవకాశముందని నిర్థారణ అయినప్పటి నుంచి వారి చూపు సహజరంగుల మీదకు మళ్లింది. నాచురల్ కలర్స్ వాడకం రోజురోజుకూ ఎక్కువవుతోందక్కడ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘నేచురల్ ఫైబర్‌ను, నేచురల్ కలర్స్‌నే వాడుదాం.
ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అనే స్లోగన్‌తో ఏ ఉద్యమమో పుట్టుకు రావాల్సిన పని లేదు. ఎవరికి వాళ్లం ఆచరిస్తే చాలు. ప్రకృతి, పర్యావరణం సమతులంగా ఉన్నప్పుడే మన జీవిక కూడా సమతుల్యంగా ఉంటుంది. అప్పుడు పాపాయి గుండెల నిండా గాలి పీల్చుకుంటూ నూలుచీర ఉయ్యాలలో తల్లి పొత్తిళ్లలో ఉన్నంత హాయిగా నిద్రపోతుంది. బిడ్డతో పాటు బిడ్డ జనరేషన్ కూడా పర్యావరణహితంగా ఎదుగుతుంది.
– వాకా మంజులారెడ్డి
ఫ్యాక్టరీ దారం
మనకు మార్కెట్‌లో దొరికే దుస్తుల్లో చాలా మటుకు కృత్రిమమైనవే. ఈ దుస్తుల్లో వాడే సింథటిక్ దారం... పొలంలో పండిన దారం కాదు. ఫ్యాక్టరీలలో రసాయనాల సమ్మేళనంతో చిక్కటి ద్రవాన్ని తయారు చేసి సన్నని చిల్లులున్న జల్లెడ నుంచి బయటకు తీస్తారు. ఇది గాలికి ఆరి సన్నని దారమవుతుంది. ఇలా తయారైన దారాలకు రంగులు కూడా రసాయనాలతో తయారైనవే అద్దుతారు. మనం మోజు పడి కొనుక్కునేది వీటినే.
మెషినరీ మీద నడిచే టెక్స్‌టైల్ ఇండస్ట్రీ అభివృద్ధి అయినప్పటి నుంచి ఆ పోటీ తట్టుకోలేక పత్తి, ఉన్ని నుంచి తయారైన నేచురల్ ఫైబర్‌కు కూడా కృత్రిమ రంగులనే వాడుతున్నారు. కంచి, ధర్మవరం వంటి బాగా పేరుమోసిన చేనేతల్లో మాత్రం సహజరంగులనే వాడుతున్నారు. మన రాష్ట్రంలో కలంకారీ అద్దకం పూర్తిగా సహజరంగుల సమ్మేళనంగా ఉండేది. ఇప్పుడు అందులో కూడా కొందరు కెమికల్ కలర్స్ వాడుతున్నట్లు నిర్ధారణ అవుతోంది. నేచురల్ కలర్స్ ఖర్చు ఎక్కువ, దాంతో ఆ దుస్తుల ధర కూడా ఎక్కువగానే ఉంటోంది.
మనకు సాధ్యమే
నాచురల్ కలర్స్‌ను కాటన్ వంటి నాచురల్ ఫ్యాబ్రిక్స్‌కు మాత్రమే కాక నైలాన్, పాలియెస్టర్ వంటి ఫ్యాబ్రిక్‌లకు కూడా వాడవచ్చు. వీటి ధర నాచురల్ ఫైబర్‌కు నాచురల్ కలర్స్ వాడిన వాటి కంటే తక్కువే ఉంటుంది. ఇప్పుడు సహజమైన రంగుల వాడకం క్రమంగా పెరుగుతోంది. వీటి ప్రాముఖ్యత తెలిస్తే బడ్జెట్ చూసుకుని ఖర్చు చేసే మధ్య తరగతి మహిళ కూడా సింథటిక్ కలర్ చీరలు రెండు కొనే బదులు ఒక్కటైనా సరే నాచురల్ కలర్స్ చీరనే కొంటుంది.
సహజమైన ఫ్యాబ్రిక్స్
సహజ రంగుల తయారీలో చెట్ల ఆకులు, పూలు, పండ్లు, గింజలు, బెరడు, వేళ్లు అన్నీ వాడతారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రంగునిస్తాయి. వీటితో తయారైన దుస్తులు వేసుకుంటే ఏ దుష్ప్రభావాలూ రావు. పైగా వాతావరణం కలుషితం కాదు. మన దేశంలో దాదాపుగా ప్రతిరాష్ట్రంలో సహజరంగులతో తయారయ్యే ఫ్యాబ్రిక్స్ అందుబాటులోఉన్నాయి. రాజస్థాన్‌లోనే వేల యూనిట్‌లున్నాయి. ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ, హ్యూమన్ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్.
ప్రకృతిని సవాల్ చేయొద్దు
మనది కలర్‌ఫుల్ కంట్రీ. ప్రకృతి ప్రధానమైన జీవనం సాగించే వాళ్లం. అడవిలో జీవించే వాళ్లు అడవిని తల్లిగానూ, నది పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్లు నదీమ తల్లి అని, సముద్రం మీద ఆధారపడి జీవించేవాళ్లు సముద్రాన్నే తల్లిగా పిలుచుకునే వాళ్లు. తల్లి అంటే పిల్లల అవసరాల మేరకు అన్నీ అందిస్తూ పోషించే ఒడి కనుకనే ఇలా పిలుచుకోవడం. మొదట్లో మనం ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తుంటే పాశ్చాత్య దేశాలు ప్రకృతిని సవాల్ చేసేవి. పారిశ్రామిక విప్లవం, ప్రింటింగ్ ప్రెస్, కొత్త ఇన్వెన్షన్లు అన్నీ కలిసి వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్నిచ్చాయి.ప్రకృతిపై ఆధిపత్యం సాధించాలన్న తపన వారిలో కనిపించేది.
దాదాపుగా మూడువందల ఏళ్లకంటే ముందునుంచే వాళ్లు రసాయనాలతో మమేకమై జీవిస్తున్నారు. దాని పర్యవసానం కూడా ముందుగా అనుభవంలోకి వచ్చింది అక్కడే. 1960లలో అమెరికాలో ‘రేసెల్ కార్సన్’ అనే మహిళా శాస్త్రవేత్త డిడిటి ప్రభావాన్ని వివరిస్తూ రాసిన ‘ద సైలెంట్ స్ప్రింగ్’ ఆ దేశాల్లో విప్లవం తెచ్చింది. ఆ కదలికతోపాటు సింథటిక్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ కారణంగా స్కిన్ కేన్సర్ రావడం వంటి అనుభవాలతో ఇప్పుడు వారికి పర్యావరణహిత ఉత్పత్తుల మీద ఆసక్తి పెరిగింది. వాళ్ల అనుభవాల నుంచి మనమూ పాఠాలు నేర్చుకోవాలి.
– డాక్టర్ పురుషోత్తమ రెడ్డి, పర్యావరణ శాస్త్రవేత్త
Comments
Please login to add a commentAdd a comment