ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడాలి
-
వైఎస్సార్‌ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతంరెడ్డి
-
దాడులకు నిరసనగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ
-
అమరవీరులకు ఘన నివాళులు
విజయవాడ (గాంధీనగర్):ఉగ్రవాదాన్ని తరిమికొట్టి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డా. పూనూరు గౌతంరెడ్డి అన్నారు. కశ్మీర్‌లో ఉగ్రదాడులను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన జరిగింది. పార్టీ కార్యాలయం నుంచి న్యూ ఇండియా హోటల్ సెంటర్, అలంకార్ సెంటర్, లెనిన్‌సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. ఉగ్రవాదుల దాడిలో బలైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గౌతంరెడ్డి మాట్లాడుతూ దాడులు జరుగుతాయని సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. దాడిలో 17 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందన్నారు. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఉగ్రదాడులను అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ అసిఫ్, ఫ్లోర్ లీడర్ పుణ్యశీల, కార్పొరేటర్లు బుల్లా విజయ్‌కుమార్, జమాల పూర్ణిమ, బీజాన్‌బీ, నాయకులు కామా దేవరాజ్, కొణిజేటి రమేష్, కాలే పుల్లారావు, మాదు శివరామకష్ణ, విశ్వనాథ రవి, షేక్ గౌస్‌మొహిద్దీన్, యాదాల శ్రీనివాసరావు, కమ్మిలి రత్నకుమార్, బూదాల శ్రీనివాసరావు, పి శరత్, వీర్ల వరలక్ష్మీ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇస్కఫ్ పాదయాత్ర
కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఇస్కఫ్ సోమవారం సత్యనారాయణపురంలో పాదయాత్ర నిర్వహించింది. ఇస్కఫ్ జాతీయ అధ్యక్షుడు కె సుబ్బరాజు మాట్లాడుతూ తీవ్రవాద సంస్థలు ప్రపంచశాంతికి విఘాతం కలిగిస్తున్నాయన్నారు. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలువరించేందుకు అందరూ పాటుపడాలన్నారు. ఉగ్రదాడిలో మరణించిన వీరజవాన్లకు నివాళులర్పించారు. ఎపీఎస్‌వైఎఫ్ నాయకులు నవనీతం సాంబశివరావు, పూజారి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు,.