
నడి సంద్రంలో ధర్నా, జల్‌రోకో
సాధారణంగా ధర్నా, ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు నేలపై ఉండే ప్రభుత్వ లేదా సంస్థలకు చెందిన కార్యాలయాల ఎదుట జరుగుతుంటాయి.
సాధారణంగా ధర్నా, ముట్టడి వంటి ఆందోళన కార్యక్రమాలు నేలపై ఉండే ప్రభుత్వ లేదా సంస్థలకు చెందిన కార్యాలయాల ఎదుట జరుగుతుంటాయి. రోడ్లపై రాస్తారోకోలు నిర్వహిస్తుంటారు. అందుకు భిన్నంగా మత్స్యకారులు నడిసంద్రంలో ధర్నా, ముట్టడి, జల్ రోకో నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చినమైనవానిలంక వద్ద నడి సముద్రం దీనికి వేదికైంది.
బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటనకు పూర్తి వివరాలు.. సముద్ర గర్భంలో చమురు నిక్షేపాలు గుర్తించేందుకు చినమైనవానిలంక తీరానికి 10 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యన ఓఎన్జీసీ అధికారులు సర్వే చేపట్టారు. దీంతో ఆగ్రహించిన సుమారు 400 మంది మత్స్యకారులు బుధవారం ఉదయం 40 బోట్లలో 10 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి సముద్రం మధ్యకు వెళ్లారు. అక్కడ సర్వే పనుల్లో పాల్గొంటున్న 8 ఓడలను ముట్టడించారు. బోట్లను నిలిపివేసి జల్‌రోకో చేశారు. అనంతరం మత్స్యకార పెద్దలు ఓఎన్జీసీ ఓడల్లోకి వెళ్లి ధర్నా జరిపారు. సర్వే వల్ల తమ ఉపాధికి గండిపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది సముద్రంలోనే మత్స్యకారులతో చర్చలు జరిపారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడంతో మత్స్యకారులు శాంతించారు.
-నరసాపురం రూరల్