అవకాశం కల్పించండి
- మీ కోసంలో జేసీకి హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్ల వినతి
అనంతపురం అర్బన్: వర్క్ ఇన్‌స్పెక్టర్లుగా తమకు తిరిగి అవకాశం కల్పించాలని ఇటీవల హౌసింగ్ శాఖలో తొలగించబడిన కాంట్రాక్ట్ ఇన్‌స్పెక్టర్లు జాయింట్ కలెక్టర్ బీ లక్ష్మీకాంతంను వేడుకున్నారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం మీ కోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్‌తో పాటు ట్రైనీ కలెక్టర్ వినోద్‌కుమార్, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి అర్జీలు స్వీకరించారు. జాయింట్ కలెక్టర్‌కు మాజీ వర్క్ ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌నాయక్, నరసింహులు, నాగరాజు, రాజూనాయక్, ఎర్రిస్వామి, అంజి, తదితరులు తమ గోడు వినిపించారు. నెల రోజుల కిందట తమను విధుల నుంచి తొలగించడతో వీధిన పడ్డామన్నారు. అదే శాఖలో ప్రస్తుతం తిరిగి వర్క్ ఇన్‌స్పెక్టర్ల నియామకం చేపట్టారన్నారు. ఇందుకు సంబంధించి ఇతర జిల్లాల్లో నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఇక్కడ మాత్రం ఇచ్చారన్నారు. తమకు తిరిగి ఉపాధి కల్పించి ఆదుకోవాలని తొలగింపబడిన వర్క్ ఇన్‌స్పెక్టర్లు రమేశ్‌నాయక్, నరసింహులు, నాగరాజు తదితరులు కోరారు.
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు : తన భర్త, అత్త, ఆడబిడ్డలు అదనపు కట్నం కోసం తనను వేధిస్తునారని కదిరి పట్టణం మూర్తిపల్లికి చెందిన టి.సూర్యకాంతమ్మ జాయింట్ కలెక్టర్‌కు విన్నవించింది. తన భర్త మైనర్ బాలికతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసులు పట్టుకుపోయారని, ఈ తతంగాన్ని సెల్ ఫోన్‌లో రికార్డు చేయగా పోలీసులు సెల్‌ఫోన్ తీసుకొని వీడియోను తొలగించారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు.
పోలానికి వెళ్లకుండా కంపవేశారు : మా పొలానికి వెళ్లకుండా కొందరు వ్యక్తులు రోడ్డుకు అడ్డుగా కంపవేసి దాడి చేశారని కదిరికి చెందిన లలితాబాయి జేసీకి అర్జీ అందజేసింది. కులంపేరుతో దూషించిన వారిపై కదిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారని పేర్కొంది. అనంతనం వారిని వదిలి వేయడంతో తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని ఆమె కోరారు.
భూమి లాక్కున్నారు : తనకు రావాల్సిన భూమికి లాక్కున్నారని, ఈ విషయంపై జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యురాలు కమలమ్మకువిన్నించినా న్యాయం జరగలేదని అనంతపురం ప్రకాశ్ రోడ్డుకు చెందిన భాగ్యమ్మ ఫిర్యాదు చేశారు. ఆర్‌డీఓకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.