
పరిశ్రమల స్థాపనకు ప్రజాపోరాటాలు
వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాపోరాటలే శరణ్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడి అన్నారు.
రాజంపేటః
వైఎస్సార్ జిల్లాపై సీఎం చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారని, పరిశ్రమల ఏర్పాటుకు ప్రజాపోరాటలే శరణ్యమని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడి అన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలంటూ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపే కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో రాజంపేటలో ఎంపీ మిథున్‌రెడ్డిని కలిసి కోరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ టీడీపీ పాలన రెండేళ్లలో జిల్లాకు ఏ ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. జిల్లాకు ఏమైనా చేయాలంటే అది ఒక్క వైఎస్సార్‌సీపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాతే సాధ్యపడుతుందని తెలిపారు. సీఎం తనయుడు లోకోష్ డైరక్షన్‌లో కార్పొరేట్ పాలిట్రిక్స్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ ఉపాధి లేక నిరుద్యోగ యువత దిక్కుతోచని పరిస్థితిలో ఉందన్నారు.
2007లో దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో బ్రహ్మిణి ఉక్కు ఫ్యాక్టరీ స్థాపన జరగడంతో సీమవాసుల ఆశలు చిగురించాయని, ఆ ఆశలు నేడు నీరుగారాయని పేర్కొన్నారు. పంచాయతీ, మండలపరిషత్తులు, జిల్లా పరిషత్తులు, ఎంపీ, ఎమ్మెల్యేలు జిల్లాలో తక్షణమే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి శంకుస్థాపన చేయాలని తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, సహాయకార్యదర్శి టీ.రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.