కర్షకుడి కన్నెర్ర
కొంతమూరు (రాజమహేంద్రవరం రూరల్): కళ్లముందే ఆకు మడులు ఎండిపోతున్నాయి ... వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ద్వారా నీరు సకాలంలో విడుదల చేయకపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంత రైతుల్లో అసహనం పెల్లుబికింది. సుమారు గంటపాటు రైతులు ఆందోళన చేపట్టడంతో ఇరు వైపులా 20 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిది. ఆదివారం నీటిని విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించి ఆందోళన విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి... కొంతమూరు గ్రామంలోని రైతులకు వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో వేసిన ఆకుమడులు ఎండిపోతున్నాయి.
ఇరిగేషన్ అధికారులకు రైతులు పలుమార్లు ఈ పరిస్థితిని వివరించినా పట్టించుకోకపోవడంతో శుక్రవారం ఉదయం నాలుగో వంతెన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రూరల్ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసిన నారు ఎండిపోకుండా వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి నీరు విడుదల చేసినప్పుడే వెంకటనగరం పంపింగ్ స్కీమ్‌కు కూడా నీరు విడుదల చేసి ఉంటే రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు.
గోదావరిలో పుష్కలంగా నీరు ఉంచుకుని ఇలా చేయడం ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. అర్బన్ జిల్లా తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనను విరమించాలని రైతులను కోరారు. ఇరిగేషన్ అధికారులు వచ్చి రైతులతో చర్చించి నీరు విడుదల చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
ఇరిగేషన్ ఈఈ వాసుదేవ్, ఏఈలు రైతులతోను, ఆకులవీర్రాజు, గ్రామ పెద్దలు దండమూడి ప్రసాద్, చెరుకూరి రత్నాజీ, చెరుకూరి బాలాజీలతో మాట్లాడారు. కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వాటిని సరిదిద్ది రెండు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం నీటిని విడుదల చేస్తామని లిఖిత పూర్వకంగా ఇవ్వాలని రైతులు పట్టుబట్టగా అధికారులు అదే పని చేయడంతో ఆందోళన విరమించారు. వైఎస్సార్ సీపీ నాయకులు యామనరామకృష్ణ, నెరుసు వెంకట్రావు,వంకా సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.