రామయ్యా.. నీ దర్శన భాగ్యమేది..
భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కరాలకు ఖమ్మం జిల్లా భద్రాచలానికి భక్త జనం పోటెత్తుతున్నారు. పుష్కర స్నానం అనంతరం శ్రీసీతారాముల వారి దర్శనం చేసుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కానీ ఆలయ అధికారులు, పోలీసులు పెడుతున్న ఆంక్షలతో భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగడం లేదు. ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్‌లో టెక్కెట్లు తీసుకున్న భక్తులకు నిరాశే ఎదురవుతోంది. పుష్కరాల్లో మొదటి మూడు రోజలు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగినప్పటికీ శనివారం నుంచి సీన్ రివర్స్ అయ్యింది. పుష్కర స్నానం అనంతరం స్వామివారిని దర్శించుకోకుండానే భక్తులు వెనుదిరుగుతున్నారు.
కాగా శనివారం నుంచి టిక్కెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కల్యాణోత్సవం మినహా, భక్తుల పేరిట ఆర్జిత సేవలన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా దేవస్థానానికి ఆదాయం బాగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని దేవస్థానం పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటకీ, గోదావరి పుష్కరాలు పూర్తయ్యేంత వరకూ టిక్కెట్ల విక్రయాలు చేపట్టడానికి వీల్లేదని తెగేసి చెబుతున్నారు.